అధ్వానంగా మారిన డీఎస్‌ఏ మైదానం
మనజిల్లా అంత విస్తీర్ణం కలిగిన దేశాలు సైతం ఒలంపిక్స్‌లో సత్తాచాటుతున్నాయి.. మనం మాత్రం జాతీయస్థాయిని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి. 125 కోట్లకు పైగా జనం అందులో 60 శాతం దాకా యువత ఉన్న మనదేశంలో గత ఒలంపిక్స్‌లో వచ్చిన పతకాల సంఖ్య రెండు.. పతకాల పట్టికలో 57వ స్థానం. మన జిల్లాకు సమానంగా ఉండే చిన్న చిన్న దేశాలు సైతం పతకాల పంట పండిస్తుంటే ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం.. సరైన శిక్షణ, సౌకర్యాలు లేకపోవడంతో మన క్రీడాకారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీడల పరిస్థితులపై ప్రత్యేక కథనం..
కడప స్పోర్ట్స్: రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల కడప నగరంలోనే ఉన్నప్పటికీ ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయస్థాయి పతకం కూడా రాకపోవడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ, వసతులు, క్రీడాసామగ్రి లేకపోవడంతో ఉన్నంతలోనే కాస్తో కూస్తో రాణిస్తున్నారే తప్ప ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు కనిపించకపోవడం గమనార్హం. క్రీడాపాఠశాల ఏర్పాటై దాదాపు 12 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కనీసం ఒక్క క్రీడాకారుడు కూడా అంతర్జాతీయస్థాయిలో పాల్గొనలేదు. దీనికి తోడు తీరా పతకాలు సాధించే సమయంలో ఇంటర్మీడియట్ గ్రూపును తీసివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. దీంతో 7 సంవత్సరాల పాటు సాధన చేసినప్పటికీ ఫలితాలు వచ్చే సమయానికి బయటకు పంపేస్తుండటంతో అంతర్జాతీయ పతకాలు కలగానే మిగిలాయి.
డీఎస్‌ఏ మైదానం.. తిరోగమనం
కడప నగరంలోని ఏకైక క్రీడామైదానం ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికార సంస్థ మైదానం. 1963లో దాదాపు 8 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మైదానం నేడు తిరోగమనంలో పయనిస్తోంది. వర్షం వస్తే మడుగులా మారడంతో పాటు ఇటీవల మైదానం మధ్యలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంతో మైదానం ధ్వంసమైంది. తర్వాత పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అధ్యాన్నస్థితికి చేరుకుంది. వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియం ఆవరణం సైతం చినుకు రాలితే.. మడుగులా మారుతోంది.
పాఠశాలస్థాయిలో పరిస్థితులు ఇలా..
జిల్లాలో దాదాపు 4376 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 1,151 పాఠశాలలు అనగా మూడోవంతు పాఠశాలల్లో తప్ప మిగతా పాఠశాలలు మైదానం లేకుండానే నెట్టుకొస్తున్నాయి. ఆటస్థలాలు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను వేళ్లమీద లెక్కగట్టవచ్చు.
పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు
ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టి విద్యార్థులకు ప్రతిరోజూ డ్రిల్, ఆటలు నిర్వహించాలి. ఇది నిబంధన కూడా. కానీ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఒక్కరోజు కూడా డ్రిల్ చేయించిన పాపాన పోవడం లేదు.
రోగాల ఉత్పత్తి కేంద్రాలు
చదువు పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చివేస్తున్నారు. పిల్లల ఇష్టాఇష్టాలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఆశయాలను పిల్లలపై రుద్దేస్తూ ఎప్పుడూ చదువుపైనే ధ్యాస ఉంచు అంటూ ఊదరగొడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రోగాల ఉత్పత్తి కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధుల భారం.. ఆటలకు దూరం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చతికిలపడుతోంది. దీంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతోంది. క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో మైదానాలన్నీ బోసిపోతున్నాయి.
జీఓ నెం. 63 ప్రకారం
2012లో అప్పటి ప్రభుత్వం వ్యాయామవిద్యను తప్పనిసరి చేస్తూ జీఓ నెం.63 జారీచేసింది. ఈ ఉత్వర్వు ప్రకారం ప్రభుత్వ, గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో వ్యాయామవిద్యను తప్పనిసరిగా నిర్వహించాలి. దీని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొం దించి ఒక పీరియడ్‌ను నిర్వహించాలి. ఈ ఉత్వర్వుల ప్రకారం వారంలో 6 పీరియడ్‌లు అమలుచేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకావడం లేదు.
51వ జీఓ ప్రకారం
2003 మే 7వ తేదీన అప్పటి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు జీఓ నెంబర్ 51 జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం. జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తే రూ. 4.5 లక్షలు, రజతం సాధిస్తే 3 లక్షలు, కాంస్యపతకం సాధిస్తే 1.5లక్షలు నగదు బహుమతిగా ఇవ్వాల్సి ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రోత్సాహకాలు అమలుకావాలి. కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితులు కనిపించడం లేదు.
అమలు కాని క్రీడా సమయం
చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్న ప్రతిపాదన కేవలం నీటిమీద రాతల్లాగా మారింది. ఆటలను చుట్టేసి.. చదువు, ర్యాంకులు, జీపీఏలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం తగ్గి మరమనుషుల్లా మారుతున్నట్లు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. 45 నిమిషాల పాటు ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి చలాకీగా ఉంటారని.. శారీరకంగా ఎదుగుదల సక్రమంగా జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏ ఒక్క పాఠశాలల్లోను క్రీడలకంటూ ప్రత్యేక సమయం కేటాయించడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులైతే మైదానం వైపు చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. స్పెషల్‌క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ ఇలా చదువులకే పరిమితం చేస్తున్నారు.
ఇరుకైన మైదానాల్లోనే..
జిల్లాలో ఆటస్థలాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో మైదానాలు ఉండాలన్న నిబంధనలు చాలాచోట్ల కనిపంచడం లేదు. దీంతో ఇరుకైన మైదానంలోనే విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తోంది. రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనపు తరగతుల నిర్మాణం చేపడుతుండటంతో ఉన్న స్థలం కాస్తా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. ఇక పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఎక్కడ ఉంటుంది. మరిక్నొ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక పిల్లలు క్రీడల్లో వెనుకబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment