మరింత మెరుగైన సేవలు
– కర్నూలులో ఎన్జీఎన్, పేరూటర్ ప్రారంభించిన సీజీఎం
– విభజన తర్వాత మొదటిసారి వచ్చిన సీజీఎంకు ఘనసత్కారం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీజీఎం దామోదరరావు తెలిపారు. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) వి.సుందర్‌తో కలిసి సోమవారం స్థానిక ఈ10బీ ఎక్స్ఛేంజీలో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్), పేరూటర్ను ప్రారంభించారు. ఏపీ సర్కిల్ విభజన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చిన ఈ ఇద్దరు రాష్ట్ర ఉన్నతాధికారులను స్థానిక ఉద్యోగులు, అధికారులు, యూనియన్ల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీఎన్తో కర్నూలు ప్రజలకు నాణ్యమైన సేవలతో పాటు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇటీవల 49కే ల్యాండ్ లైన్, 249కే బ్రాడ్‌బ్యాండ్ పథకాలు అమలు చేస్తున్నామని, జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. త్వరలో ఎక్సేంజ్ పరికరాలు ప్రజల వద్దకే తీసుకెళ్లే విధానం కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆరునెలల కాలంలో 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఫై సేవలకు ప్రస్తుతం ఐదు చోట్ల అనుమతించామని, టవర్ల కంటే వైఫై విధానమే మేలని తెలిపారు.