సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన పీహెచ్డీ ఎం వెంకటేష్(26) గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి హాస్టల్ రూములో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్జీవంగా పడివున్న వెంకటేష్‌ను ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో అతడి స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొఫెసర్ వేధింపులు భరించలేకే వెంకటేష్ ప్రాణాలు తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తనకు గైడ్‌ను కేటాయించకుండా కొన్ని నెలలుగా వేధిస్తుండడంతో వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి స్నేహితులు తెలిపారు. వెంకటేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించామని చందానగర్ ఎస్సై ఎన్ వాసు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.