మొబైల్ కంపెనీలన్నింటితో జియో భాగస్వామ్యం!
న్యూఢిల్లీ : ఇప్పుడా అప్పుడా అంటూ 4జీ సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ తేదీతో ఇతర టెలికాం ఆపరేటర్ల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, స్మార్ట్ ఫోన్ల తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ మరింత షాకిలిస్తోంది. జియో సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ నాటికి స్మార్ట్ ఫోన్ తయారీదారులందరితోనూ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రయత్నాలు ప్రారంభించేసింది. హ్యాండ్ సెట్ కంపెనీల భాగస్వామ్యంతో యూజర్లలందరికీ మూడు నెలల ఉచిత డేటా, వాయిస్ సర్వీసులను రిలయన్స్ అందించాలనుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రారాజుగా ఉన్న శాంసంగ్ తో ఈ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియాలు డేటా ప్యాక్ లపై భారీగా ఆఫర్లను ప్రకటించేశాయి. మరో రెండు రోజుల్లో వొడాఫోన్ సైతం తన కస్టమర్లకు డేటా ప్యాక్ లపై శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్ కంపెనీ భాగస్వామ్యంతో ఇటు జియో సర్వీసుల కార్యకలాపాలు పెరగడంతో పాటు, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరుగుతాయని ప్లాన్ కు సంబంధించిన టాప్ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. ఈ ప్లాన్ తో రిలయన్స్ కంపెనీ తన కస్టమర్ బేస్ ను పెంచుకోనుంది. రిలయెన్స్ తన కంపెనీ ఉద్యోగుల కోసం గతేడాదే జియో సేవలను ప్రారంభించింది. ఈ ఆగస్టులో కమర్షియల్ గా లాంచ్ అయ్యేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు చేసినవారికి 4జీ జియో సిమ్ ను రిలయన్స్ ఆఫర్ గా అందిస్తోంది.
లైఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు, ఉద్యోగులు, బిజినెస్ పార్టనర్లు మొత్తం కలిపి ఇప్పటికే కంపెనీకి 1.5 మిలియన్ పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సేవలను లాంచ్ చేసిన రెండేళ్లలో 90శాతం జనాభాకు తన సేవలను అందించి, తన కవరేజ్ ను విస్తరించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఇప్పటికే రిలయెన్స్ జియో 70శాతం తన సేవలను విస్తరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 30 మిలియన్ సబ్ స్క్రైబర్లను రిలయెన్స్ జియో చేరుకుంటుందని, 1బిలియన్ డాలర్ల రెవెన్యూను ఆర్జిస్తుందని మోర్గాన్ స్టాన్లి రిపోర్టు పేర్కొంటోంది.