మొబైల్ కంపెనీలకు భద్రతా ప్రమాణాలు
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ కంపెనీల నుంచి వ్యక్తిగత, ఆర్థిక సమాచారం చోరీకి గురవుతుందన్న ఆందోళనలతో ఫోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను జారీ చేయనుంది. చైనా కంపెనీల విషయంలో మరింత అప్రమత్తత కోసం ప్రభుత్వం మొబైల్ తయారీ కంపెనీలకు కఠిన భద్రతా, ప్రైవసీ మార్గదర్శకాలు, ప్రమాణాలను నిర్థేశించనుంది. మొబైల్ యూజర్ల డేటాను పరిరక్షించేలా రానున్న కొద్దివారాల్లో ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ను ప్రకటిస్తుందని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
మొబైల్ ఫోన్‌ల నుంచి సమాచార చోరీని అరికట్టేందుకు త్వరలో కఠిన ప్రమాణాలు, మార్గదర్శకాలను జారీ చేస్తామని, ఇది చాలా సీరియస్ అంశమని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్‌లో ఆన్‌లైన్ కార్యకలాపాలకు అత్యధికులు మొబైల్ డేటాపైనే ఆధారపడుతుండటంతో ఇంటర్‌నెట్ యాక్సెస్ నేపథ్యంలో డేటా చోరీ ఆందోళనకర అంశంగా ముందుకొస్తోంది. మరోవైపు దేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో అత్యధికంగా చైనా కంపెనీలవే కావడం గమనార్హం. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారంతో రిస్క్ చేయలేమని కూడా ప్రభుత్వం భావిస్తున్నది.