physical handicaps
-
అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్‌కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్) తన భర్త రాజ్‌కుమార్‌ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు. కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్మాస్టర్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు. అసలేం జరిగింది? ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్ హెడ్మాస్టర్. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్/చైల్డ్ కేర్ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్ కాగానే వారి కి ఫోన్ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్ పే/గూగుల్ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్మాస్టర్కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం.. ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్ తీసుకున్నారని తిరుమల–రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్.. తిమ్మాపూర్‌లో ఓ టీచర్ 2022 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్ జీతం డిసెంబర్లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్మాస్టర్ సదరు టీచర్‌ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్ హెచ్ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విదేశాలకు వెళ్లిన టీచర్‌కు డీఈవో అనుమతి కనికరం లేని పోలీసులు.. పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్మాస్టర్ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇవి చదవండి: ఏఆర్ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన -
ధీమాగా ఓటేయండి...!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): దివ్యాంగులైన ఓటర్లు ఇక సులువుగా తమ ఓటు హక్కు వినియోంచుకోవచ్చు. గతంలో ఓటేయ్యాలంటే ఇంటినుంచి కదల్లేని పరిస్థితి ఉండేది. ఇతరుల సహాయంతో కష్టం మీద పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయ్యాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు సులభంగా, ఎలాంటి కష్టం లేకుండా ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. దివ్యాంగుల ఓటు శాతం పెంచడానికి వారికి కావాల్సిన అన్ని సదుపాయాల కల్పన చేసింది. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి రవాణా సౌకర్యాన్ని పోలింగ్ రోజున ఏర్పాటు చేయించింది. వారు ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద దింపేయనున్నారు. దివ్యాంగులకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యతలను ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులకు అప్పగించింది. అందులో భాగంగా నడవగలిగే దివ్యాంగులు మెట్లు ఎక్కడానికి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్‌లను ఇప్పటికే నిర్మించగా, అక్కడికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్‌చైర్ ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 443 వీల్చైర్లను ఏర్పా టు చేసేందుకు కొనుగోలు చేశారు. టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అదే విధంగా అంధులు సాధారణ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారి కోసం ఈసారి బ్రెయిలీ బ్యాలెట్లను ఏర్పాటు చేయనున్నారు. బ్రెయిలీ లిపిని తయారు చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులు పూర్తి ప్రణాళికను తయారు చేశారు. వారి లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం దివ్యాంగ ఓటర్లు 17,886 మంది ఉండగా, ఇందులో అంధులు 2,286 మంది, మూగ, చెవిటి 1,556 మంది, శారీరక దివ్యాంగులు 11,751 మంది, ఇతర కేటగిరి వారు 2,293 మంది ఉన్నారు. సహాయంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు... ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే అన్ని రకాల దివ్యాంగులకు సహాయంగా నిలువడానికి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్ఎస్ఎస్ వలంటీర్లను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని పోలింగ్ వద్దకు తీసుకెళ్తారు. మూగ, చెవిటి ఓటర్లకు వారి భాషలో సమాచారం అందించడానికి బీఎల్ఓలకు, ఇతర సిబ్బందికి సైన్ లాంగ్వేజి శిక్షణ ఇచ్చారు. అవగాహన కోసం వాల్ పోస్టర్లు, కరపత్రాలు.. దివ్యాంగ ఓటర్లను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు వాల్ పోస్టర్లు, కరపత్రాలను తయారు చేశారు. వాటిని ఇటీవల కలెక్టర్ రామ్మోహన్ రావు, ఎన్నికల పరిశీలకులు విడుదల చేశారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వాల్ పోస్టర్లను, కరపత్రాలను సరఫరా చేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లు ఓటు ఎలా వేయాలి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర సమాచారాన్ని వాటిలో పొందుపరిచారు. ప్రత్యేక హెల్ప్‌లైన్.. ఎన్నికల్లో ఓటేసే దివ్యాంగులకు సందేహాల నివారణకు, సమాచారం, ఇతర వివరాలు అందించేందుకు, ఫిర్యాదు కోసం జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ (కలెక్టరేట్)లో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 08462–251690కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. -
సదరం సర్టిఫికెట్లు లేక వికలాంగులకు వేదన
సాక్షి, హైదరాబాద్: సమగ్ర సర్వే వేల మంది వికలాంగుల పెన్షన్‌కు ఎసరు తీసుకుని వచ్చింది. సర్వేలో వికలాంగులు విధిగా సదరం సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయాలని స్పష్టంగా పేర్కొనడంతో..ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దసరా నుంచి తమకు నెలకు రూ. 500 నుంచి 1500 వచ్చే సమయంలో ఈ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల పెన్షన్లు తొలగిస్తారని భయపడుతున్నారు. సర్వే ఉద్దేశం కూడా సరైన సర్టిఫికేట్ల లేని వారిని అనర్హులుగా గుర్తించడం, అర్హులకు పెన్షన్లు ఇవ్వడమని సర్కార్ చెప్పడంతో ఏమి చేయాలో తెలియక సర్టిఫికెట్లు లేని వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. 40% కంటే అధికంగా వైకల్యం ఉన్నప్పటికీ.. డాక్టర్లు ఈ సదరం సర్టిఫికెట్లను వికలాంగుల ఇళ్లకు ఇప్పటి వరకు పంపిం చలేదు. సదరం శిబిరాలకు వికలాంగులు వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పటికీ..ఈ సర్టిఫికెట్లను పంపిణీ చేయడంలో డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా వికలాంగులు పింఛన్లకు దూరం కావాల్సి వస్తోంది. తమతప్పు లేకపోయినా పెన్షన్ కోల్పోవడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిజిల్లాలోనూ వేలమంది వికలాంగుల పెన్షన్లలో కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న పెన్షనర్లలో 25 నుంచి 30 శాతానికి పైగా వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు అందలేదు. పెన్షన్ మొత్తాన్ని రూ. 1500లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భారాన్ని తగ్గించుకోవడానికి ఈ సర్టిఫికేట్లను సాకుగాచూపి వేలాది పెన్షన్లు తొలగించే యత్నం చేస్తోందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సమితి ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు, సదరం సర్టిఫికేట్లు అందనివారి వివరాలు పై విధంగా ఉన్నాయి. వీరంతా తాము సర్వేలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఎలా నమోదు చేసుకోవాలని సతమతమవుతున్నారు. -
వికలాంగులకు రూ 1500 పింఛన్ ఇవ్వాలి
సూర్యాపేట టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగుల పింఛన్‌ను రూ 1500కు పెంచాలని తెలంగాణ వికలాంగుల,వితుంతు, వృద్ధుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్యవర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. వృద్ధులు, వితంతువులకు రావాల్సిన ప్రభుత్వ పథకాల సాధన కోసం సంఘం పోరాడుతుందని చెప్పారు. ప్రభు త్వ ఉద్యోగాలలో వికలాంగులకు దక్కాల్సిన 3శాతం రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేయాలన్నారు. అదే విధంగా ప్రయాణ రాయితీలో వికలాంగులకు పూర్తి సౌకర్యం, వృద్ధులు, వితంతువులకు 50శాతం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మట్టపల్లి సుమలత, నాయకులు మిద్దె సైదులు, గంజికుంట్ల యాదగిరి, పతాని ప్రభాకర్, మల్లయ్య, యాదగిరి, నాగవెల్లి కరుణాకర్, భూక్య సైదా, బానోతు వేణు, రాము, లునావత్ మహేష్, ఉపేందర్, రామినేని సైదులు పాల్గొన్నారు.