ఓటు ఎలా వేయాలో అవగాహన పొందుతున్న దివ్యాంగులు (ఫైల్)
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): దివ్యాంగులైన ఓటర్లు ఇక సులువుగా తమ ఓటు హక్కు వినియోంచుకోవచ్చు. గతంలో ఓటేయ్యాలంటే ఇంటినుంచి కదల్లేని పరిస్థితి ఉండేది. ఇతరుల సహాయంతో కష్టం మీద పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయ్యాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు సులభంగా, ఎలాంటి కష్టం లేకుండా ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. దివ్యాంగుల ఓటు శాతం పెంచడానికి వారికి కావాల్సిన అన్ని సదుపాయాల కల్పన చేసింది. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి రవాణా సౌకర్యాన్ని పోలింగ్ రోజున ఏర్పాటు చేయించింది. వారు ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద దింపేయనున్నారు.
దివ్యాంగులకు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యతలను ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులకు అప్పగించింది. అందులో భాగంగా నడవగలిగే దివ్యాంగులు మెట్లు ఎక్కడానికి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్‌లను ఇప్పటికే నిర్మించగా, అక్కడికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్‌చైర్ ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 443 వీల్‌చైర్‌లను ఏర్పా టు చేసేందుకు కొనుగోలు చేశారు.
టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అదే విధంగా అంధులు సాధారణ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారి కోసం ఈసారి బ్రెయిలీ బ్యాలెట్‌లను ఏర్పాటు చేయనున్నారు. బ్రెయిలీ లిపిని తయారు చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులు పూర్తి ప్రణాళికను తయారు చేశారు. వారి లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం దివ్యాంగ ఓటర్లు 17,886 మంది ఉండగా, ఇందులో అంధులు 2,286 మంది, మూగ, చెవిటి 1,556 మంది, శారీరక దివ్యాంగులు 11,751 మంది, ఇతర కేటగిరి వారు 2,293 మంది ఉన్నారు.
సహాయంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు...
ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే అన్ని రకాల దివ్యాంగులకు సహాయంగా నిలువడానికి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని పోలింగ్ వద్దకు తీసుకెళ్తారు. మూగ, చెవిటి ఓటర్లకు వారి భాషలో సమాచారం అందించడానికి బీఎల్‌ఓలకు, ఇతర సిబ్బందికి సైన్ లాంగ్వేజి శిక్షణ ఇచ్చారు.
అవగాహన కోసం వాల్ పోస్టర్లు, కరపత్రాలు..
దివ్యాంగ ఓటర్లను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు వాల్ పోస్టర్లు, కరపత్రాలను తయారు చేశారు. వాటిని ఇటీవల కలెక్టర్ రామ్మోహన్ రావు, ఎన్నికల పరిశీలకులు విడుదల చేశారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వాల్ పోస్టర్లను, కరపత్రాలను సరఫరా చేస్తున్నారు. దివ్యాంగ ఓటర్లు ఓటు ఎలా వేయాలి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర సమాచారాన్ని వాటిలో పొందుపరిచారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్..
ఎన్నికల్లో ఓటేసే దివ్యాంగులకు సందేహాల నివారణకు, సమాచారం, ఇతర వివరాలు అందించేందుకు, ఫిర్యాదు కోసం జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ (కలెక్టరేట్)లో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 08462–251690కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment