నిద్ర.. ఎక్కువైనా, తక్కువైనా కష్టమే!
న్యూయార్క్: కొందరు ఎప్పుడూ అతిగా నిద్రపోతుంటారు. పైగా అధిక విశ్రాంతి తీసుకుంటున్నాం కదా. అరోగ్యానికి వచ్చే ఇబ్బందిలేదు అని భావిస్తారు. కానీ అది తప్పు అని తేలింది. సరిపడా నిద్ర పోకపోవడం మాత్రమే కాదు అతిగా నిద్రపోవడం కూడా ప్రమాదకరమేనని వైద్యులు అంటున్నారు. ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితుల వల్ల శారీరక అనారోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయని భావించారు. కానీ మానసికంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు వ్యాపకాల వల్ల చిరాకు, కోపం, అసహనం, తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం, కోరికలు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంట్నునవారు తాము నిద్రపోయే గంటలలో మార్పులు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మనిషికి సగటున 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధన చేసిన వైద్య బృందం ఈ విషయాలను వెల్లడించింది.