పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు
ఈ-కామర్స్ వెబ్సైట్ల రాకతో మనకు కావాల్సిన వస్తువులను కాలు కదపకుండా ఇంటికి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. ఆన్లైన్ ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు చెంతకు వచ్చి చేరుతోంది. అయితే మనం కొనాల్సిన వస్తువు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూల మీద ఆధారపడుతుంటాం. ఇలాంటి రివ్యూలే ఇప్పుడు మనకు హాస్యం పండిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో పిడకల మీద పెట్టిన రివ్యూలు చూస్తే కడుపు చెక్కలవాల్సిందే. హిందువులు వివిధ క్రతువుల్లో ఆవు పేడ పిడకలను వినియోగిస్తుంటారు. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకలను ‘కౌ డంగ్ కేక్’ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి.
వీటి గురించి తెలియని కొంత మంది రాసిన రివ్యూలు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘ఇవి చాలా బాగున్నాయి. వీటి వాసన గులాబి పూల మాదిగా ఉందని’ పేర్కొంటూ ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ‘వీటి సైజు చాలా పెద్దగా ఉంది. నోటితో కొరకడానికి వీలు కాదంటూ’ మరొకరు పేర్కొన్నారు. దీని రుచి అమోఘం అంటూ మరొకరు పొడిగారు. ‘దీన్ని కొనకండి. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ బాలేదంటూ’ ఇంకొరు ఒక స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఈ రివ్యూలు చూసిన తర్వాత మనోళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. ఇంట్లో డెకరేషన్ కోసం పిడకలు వాడతారని సదరు వెబ్సైట్లు పేర్కొనడం కొసమెరుపు.