పులిని కూడా కుక్కే అనుకోని..
పిలిబిత్: పులి చొరబడినప్పటికీ ఆ ఇంట్లో వాళ్లంతా అది కుక్క అనుకున్నారు. అది ఏం చక్కా ఓ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఆ విషయం గమనించకుండా ఆ ఇంట్లో వాళ్లు తమ పని తాము చేసుకుపోయారు. చివరకు అది ఒకసారి గాండ్రించిన తర్వాతగాని ఇంట్లోకి వచ్చింది కుక్కకాదు పులి అని అర్థమైంది. ఆ వెంటనే అంతా సురక్షితంగా భయంతో ఒక్కచోట చేరి అధికారులకు సమాచారం ఇచ్చి బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే పిలిబిత్ కు 30 కిలోమీటర్ల దూరంలోని మల్పూర్ ఖాజురియా అనే గ్రామంలో జగదీశ్ ప్రదేశ్ అనే వ్యక్తి ఉన్నాడు.
ఆ ఇంట్లో వాళ్లంతా ఉదయాన్ని లేచి తమ పనులు నిమగ్నమై పోయి టీ తాగుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద పులి ఇంట్లోకి దిగింది. అయితే, నిండా దట్టమైన మంచుఅల్లుకొని ఉన్న కారణంగా అది వీధి కుక్కేమో అని జగదీశ్ అనుకున్నాడు. కానీ, కొద్ది సేపటికి అది గాండ్రించడంతో పులి అనే విషయం అర్థమై అది బయటకు రాకముందే చాకచక్యంగా తలుపేసి తాళం వేశారు. అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాదాపు గంటన్నరపాటు శ్రమపడి పులిని బందించారు. మత్తుమందిచ్చి తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. పులులు తిరిగే ఉత్తరాఖండ్ అడవుల పక్కనే పెద్దపెద్ద చెరుకు తోటలు ఉన్నాయి. ఆ చెరుకు తోటలోకి వెళ్లిన పులి తిరిగి అడవిలోకి వెళ్లే దారి తప్పి ఆ గ్రామంలోకి వచ్చిందని అధికారులు చెప్పారు.