జీమెయిల్ ఇన్‌బాక్స్ ఫీచర్లు భలే!
ఈ కాలంలో ఈ మెయిల్ లేకుండా పని అస్సలు నడవదు. కానీ పని పెరిగిన కొద్దీ మెయిల్ ఇన్‌బాక్స్ కూడా గందరగోళమైపోతుంది. అవసరమైన మెయిల్ సమయానికి చిక్కదు. ఏది ఉంచుకోవాలో, ఏది తొలగించుకోవాలో తెలియని స్థితిలో అన్ని మెయిళ్లూ పేరుకుపోయి చికాకు పెడుతూంటాయి. ఈ ఇబ్బందుల నుంచి కొంతైనా ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను వాడటం మొదలుపెట్టండి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఈ సరికొత్త మెయిల్లోని ఫీచర్లు భలేగా ఉన్నాయి. అవేమిటో మీరూ చూసేయండి మరి...
‘పిన్’లతో మతిమరుపునకు చెక్!:
ముఖ్యమైన మెయిళ్లకు రిప్లై ఇవ్వడం మరచిపోతున్నారా? అయితే పిన్ ఫీచర్ గురించి మీకు తెలియదన్నమాట. ఇన్‌బాక్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వాడుకుంటే మీ మతిమరుపునకు అది ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని అనుకుంటున్న మెయిల్‌పై కర్సర్‌ను కదిలిస్తే పిన్ కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి మెయిల్‌పై నొక్కితే చాలు.. అ తరువాత ఆ మెయిల్ ఇన్‌బాక్స్ మొదట్లో, మధ్యలో ప్రత్యేకంగా వేలాడుతూ కనిపిస్తుంటుంది. మీ దృష్టిని ఆకర్షిస్తుంది. పిన్ తొలగించేంతవరకూ అలాగే ఉంటుంది. దీంతో మీరు కచ్చితంగా ఈ మెయిల్‌కు స్పందించకమానరు.
స్వీప్ చేసేస్తుంది
మెయిళ్లన్నింటినీ ఒక్కసారిగా బండిల్ చేసి ఆర్కైవ్స్‌లో పడేసేందుకు పనికొచ్చే ఫీచర్ ఇది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి వచ్చే ఇన్విటేషన్లుగానీ ఇతర సమాచారాన్ని గానీ గంపగుత్తగా ఇన్‌బాక్స్ నుంచి వేరు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక్కో మెయిల్‌ను చూసి భద్రపరచుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయించుకునే అవసరం తప్పుతుందన్నమాట. ఒకవేళ మీరు పొరబాటున ముఖ్యమైన మెయిళ్లతో (పిన్ చేసినవి) కలిపి స్వీప్ చేసినా... ఆ మెయిళ్లు మినహా మిగిలినవి మాత్రమే బండిల్ అవడం విశేషం.
కట్టకట్టేసి
ఇన్‌బాక్స్‌లో ఉన్న మరో మంచి ఫీచర్ బండిల్! పేరులో ఉన్నట్లే ఈ ఫీచర్ మన మెయిళ్లన్నింటినీ ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అన్న మూడు వర్గాలుగా విభజించి చూపుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సమాచారం, పోస్ట్‌లు అన్నీ సోషల్ ట్యాబ్ కింద, కంపెనీలు పంపే వ్యాపార మెయిళ్లన్నీ ప్రమోషన్‌లోనూ పడిపోతాయి. ఇవేకాకుండా ట్రావెల్, ఫైనాన్స్, పర్చేజెస్, అప్డేట్స్ అన్న ఇతర కేటగిరీలుగానూ విభజించుకునే వెసులుబాటు ఉంది.
జాబితాలోనే మెయిల్ లింక్‌లు
అందిన ప్రతిమెయిల్ను తెరవడం.. అందులో ఇతర పేజీలకు లింక్లేవైనా ఉంటే వాటిని క్లిక్ చేసి చూడటం... ఇది మనం మామూలుగా చేసే పని. జీమెయిల్ ఇన్‌బాక్స్ వ్యవహారం కొంచెం వేరు. ఇందులోని ప్రీవ్యూ ఫీచర్ ద్వారా మెయిల్ జాబితాలోలోనే కొంచెం పక్కగా ఆ మెయిల్లో ఉండే లింక్‌లు కనిపిస్తూంటాయి. మెయిల్ సబ్జెక్ట్, లింక్ ఏమిటన్నది చూసుకుని అవసరమైతే నేరుగా లింక్‌నే ఓపెన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడికక్కడే తొలగించుకోనూ వచ్చు.