PK Mahanty
-
పీకే మహంతి పక్షపాతం చూపారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రత్యూష్ సిన్హా కమిటీ సభ్యుడు పీకే మహంతిపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పలు ఆరోపణలు చేశారు. ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన పీకే మహంతి పక్షపాతంతో వ్యవహరించారని సోమేశ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. కమిటీ సభ్యుడిగా మహంతి నిష్పాక్షికంగా వ్యవహరించారని చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నారు. ఐఏఎస్ పదవికి పీకే మహంతి రాజీనామా చేయడం ద్వారా తన అవకాశాలను దారుణంగా దెబ్బతీశారని సోమేశ్ హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా ధర్మాసనం తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడ తామని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస్టిస్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ, పీకే మహంతి రాష్ట్ర విభజనకు ఒక్కరోజు పదవీ విరమణ చేసినందున ఆయన పేరును జాబితాలో చేర్చలేదన్న కేంద్రం వాదన సరికాదన్నారు. జూన్ 1న మహంతి పేరు మీద పలు జీవోలు జారీ అయ్యాయని, ఐవీఆర్ కృష్ణా రావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ఆయన సర్వీసులో ఉన్నారనేందుకు ఈ జీవోలే సాక్ష్యమని వివరించారు. తాత్కాలిక జాబితాలో ఉన్న పలువురు అధికారుల పేర్లు తుది జాబితాలో లేవన్నారు. లాటరీలో రోస్టర్‌ను ముందుగా తెలం గాణకే కేటా యించాల్సిందని, అయితే అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని సీతారామమూర్తి చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఉమ్మడి 'జీవో'పై కేసీఆర్ అసంతృప్తి!
హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్ష జీవో విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అసంతృప్తిని వ్యక్తం చేశారు. గవర్నర్ నివాసం రాజభవన్ లో నరసింహన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలతో పాటు సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లోను ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటాను పదేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగించడంపై నరసింహన్ తో కేసీఆర్ చర్చించినట్టు తెలుసింది. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో విభజనకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. -
'కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఉద్యోగుల విభజన'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంలో రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్) పీకే మహంతి పాల్గొన్నారు. పూర్తి స్థాయి ఉద్యోగుల విభజన కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జరుగుతుందని కేంద్రానికి సీఎస్ మహంతి తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహంతి..వారం రోజుల్లో విభజన పక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. -
19 మంది ఐఏఎస్‌లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డి.కాడ్మియల్‌ను బదిలీ చేసినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. -
'బిల్లు గడువు పెంచితే.. సమస్యలు తలెత్తవచ్చు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు- 2013 పై అసెంబ్లీలో చర్చించడానికి గడువును పెంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ తో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పీకే మహంతి సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో మన్మోహన్ సింగ్ ను కలిసి.. అసెంబ్లీలో బిల్లుపై జరుగుతున్న చర్చ వివరాలను తెలిపినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో బిల్లు గడువు పెంపుపై చర్చించారు. బిల్లుపై చర్చించడానికి సమావేశాల గడువును పెంచాలని రాసిన లేఖను, అసెంబ్లీలో చర్చ వివరాలను ఆజిత్ కుమార్ కు అందించారు. అయితే గడువు పెంపుతో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అజిత్ సూచించినట్టు తెలిసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని పీకే మహంతికి తెలిపినట్టు సమాచారం.