'బిల్లు గడువు పెంచితే.. సమస్యలు తలెత్తవచ్చు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు- 2013 పై అసెంబ్లీలో చర్చించడానికి గడువును పెంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ తో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పీకే మహంతి సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో మన్మోహన్ సింగ్ ను కలిసి.. అసెంబ్లీలో బిల్లుపై జరుగుతున్న చర్చ వివరాలను తెలిపినట్టు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో బిల్లు గడువు పెంపుపై చర్చించారు. బిల్లుపై చర్చించడానికి సమావేశాల గడువును పెంచాలని రాసిన లేఖను, అసెంబ్లీలో చర్చ వివరాలను ఆజిత్ కుమార్ కు అందించారు. అయితే గడువు పెంపుతో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అజిత్ సూచించినట్టు తెలిసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని పీకే మహంతికి తెలిపినట్టు సమాచారం.