భారత్ ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్
- డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ‘డ్రా’ విడుదల
- స్వదేశంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు మ్యాచ్
లండన్: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీల్లో భారత్ పురుషుల టెన్నిస్ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 20 వరకు జరిగే ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్, మాజీ చాంపియన్ చెక్ రిపబ్లిక్‌తో భారత్ తలపడుతుంది. భారత్‌లోనే జరిగే ఈ మ్యాచ్‌కు వేదికను (న్యూఢిల్లీ లేదా పుణే) వచ్చే నెలలో ఖరారు చేసే అవకాశముంది. 2012, 2013లలో డేవిస్ కప్ టైటిల్‌ను నెగ్గిన చెక్ రిపబ్లిక్... 1980లో అవిభాజ్య చెకోస్లోవేకియా రూపంలో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.
ప్రపంచ 6వ ర్యాంకర్ థామస్ బెర్డిచ్తోపాటు 44వ ర్యాంకర్ జిరీ వాసెలీ, 54వ ర్యాంకర్ లుకాస్ రోసోల్ చెక్ రిపబ్లిక్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశముంది. డబుల్స్‌లో ఫ్రాంటిసెక్ సెర్మాక్ (70వ ర్యాంకర్), రోమన్ జెబావీ (106వ ర్యాంకర్) ఉన్నారు. వీరే కాకుండా గతంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు భాగస్వాములుగా ఉన్న రాడెక్ స్టెపానెక్, లూకాస్ లూహీ కూడా జట్టులో ఉండే అవకాశముంది.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ముగిసిన ఐదు రోజులకే డేవిస్ కప్ పోటీ ఉన్నందున బెర్డిచ్లాంటి స్టార్ ప్లేయర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే భారత్‌కూ విజయావకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖాముఖి రికార్డులో చెక్ రిపబ్లిక్ 3-0తో భారత్‌పై ఆధిక్యంలో ఉంది. 1997లో చెక్ రిపబ్లిక్ చేతిలో 2-3తో ఓడిన భారత్... 1986లో, 1926లో చెకోస్లోవేకియా చేతిలో 1-4తో పరాజయం పాలైంది.