కారులో ఇరుక్కుని.. బాలుడి మృతి
పొరపాటున కారులో ఇరుక్కుపోయి.. కారు లాక్ అయిపోవడంతో ఊపిరాడక రెండున్నరేళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో న్యూమార్కెట్ ప్రాంతంలో జరిగింది. అతిశయ్ జైన్ అనే ఈ బాలుడు స్థానిక వస్త్రవ్యాపారి కొడుకు. దుకాణంలో ఆడుకుంటూ.. ఎవరికీ తెలియకుండా కారు తాళాలు తీసుకుని కారులోకి వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టాడు.
పిల్లాడు వెళ్లగానే కారు తాళాలు ఆటోమేటిగ్గా పడిపోయాయి. అద్దాలు కూడా మూసి ఉండటంతో లోపల గాలి ఆడక.. పిల్లవాడు మరణించినట్లు అతడి తాత కమల్ జైన్ విలేకరులకు తెలిపారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత పిల్లాడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతడి తల్లి పైన ఉన్న ఇంట్లోంచి కింద దుకాణంలోకి వచ్చింది. తీరా అక్కడ లేకపోవడంతో వెతగ్గా, కారులో స్పృహకోల్పోయి కనిపించాడు. తర్వాత డూప్లికేట్ తాళాలతో కారు తెరిచి, పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.