పథకాలకు అమ్మ పేర్లు తీసేయండి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా దోషేనని తేలినందువల్ల ప్రభుత్వ పథకాల్లో ఆమె పేరును తీసేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ డిమాండ్ చేశారు. తమిళనాట ప్రభుత్వ పథకాలు అన్నింటికీ ముందు 'అమ్మ' పేరు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పళనిస్వామి తన టేబుల్ మీద జయలలిత ఫొటో పెట్టుకుని, ఆమెకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతే సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారని, జయలలిత చూపిన మార్గంలో ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారని గుర్తుచేశారు.
మహిళలకు రాయితీపై టూ వీలర్లు ఇచ్చే పథకానికి అమ్మ టూ వీలర్ స్కీం అని పేరుపెట్టారని, అది తగదని.. ప్రభుత్వం రాజ్యాంగపరంగా నడుచుకోవాలని రాందాస్ చెప్పారు. కావాలనుకుంటే పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు జయలలితకు నివాళులు అర్పించుకోవచ్చు గానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాదని ఆయన చెప్పారు. అమ్మ మంచినీళ్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ విత్తనాలు, అమ్మ సిమెంట్, అమ్మ స్పెషల్ క్యాంప్, అమ్మ రుణపథకాలు, అమ్మ థియేటర్లు, అమ్మ మెటర్నిటీ సంజీవి పథకం... ఇలాంటి పథకాలన్నింటికీ ప్రభుత్వ పథకాలుగా పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని రాజ్యాంగ ప్రకారం నడపాల్సిందిగా ముఖ్యమంత్రికి గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించాలని రాందాస్ కోరారు.