ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే
పని మీద ఊరుకానీ ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు నెలకొల్పిన కాన్సెప్ట్ ‘క్యాప్సుల్ హోటల్’. జపాన్‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్.. వయా సింగపూర్, ఇండియా మీదుగా యూరప్‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌లో క్యాప్సుల్ హోటల్స్‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్ హోటల్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు..?
(చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!)
క్యాప్సుల్ హోటల్స్.. సింపుల్‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్రూమ్స్తో కూడిన కాంప్లెక్స్‌లివి. ఒక చిన్న ఛాంబర్లో మినిమమ్ ఫెసిలిటీస్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌లో వీటినే ‘పాడ్ హోటల్స్’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌బాక్స్’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్ హోటల్స్ బిజినెస్ పెరుగుతోంది.
కమర్షియల్‌గా మార్చేశారు
జపాన్ ఉమెడ జిల్లా ఒసాకాలో తొలి క్యాప్సుల్ హోటల్ని 1979లో ఏర్పాటు చేశారు. జపనీస్ ఫేమస్ ఆర్టిటెక్ట్ కీషో కురోకావా ఆ హోటల్ని డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత టోక్యోలో మరో మూడు బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. నిజానికి వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్‌సైడ్ జీవితాల్ని గడిపేవాళ్ల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చలికాలంలో రాత్రిళ్లు ఉండేందుకు తక్కువ ఖర్చుతో వాళ్లకు క్యాప్సుల్ హోటల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, రాను రాను ఇదొక బిజినెస్‌గా మారింది. మూడేళ్లలోనే జపాన్ మొత్తం మీద నలభైకి పైగా క్యాప్సుల్ హోటల్స్ వెలిశాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించాయి.
సకల సౌకర్యాలు
క్యాప్సుల్ హోటల్ ఛాంబర్లు చూడటానికి స్లీపర్ కోచ్ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌కి మరో ఛాంబర్ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్ టబ్ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌తో డోర్, దానికొక కర్టెన్ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్, లైట్, పవర్ ప్లగ్, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌ట్యాప్‌ని ఇస్తారు. న్యూస్ పేపర్, రీడింగ్ మెటీరియల్స్ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్ హోటల్స్ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్ స్పెషల్‌గా ఉంటాయి. ఛాంబర్ కాంప్లెక్స్ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్ ఉంటుంది. క్యాప్సుల్‌లో తినడానికి, సిగరెట్ తాగడానికి వీల్లేదు. అయితే బాత్రూమ్లు మాత్రం బయట కామన్‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్, షవర్స్, స్నాక్ బార్స్, పూల్స్.. ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ సెపరేట్‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే క్లాస్ట్రోఫోబియా(ఇరుకుప్రదేశాలంటే భయం) ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌కి దూరంగా ఉండటమే బెటర్.
మైనస్లున్నాయ్
ఒకరకంగా చెప్పాలంటే ఇది తొమ్మిది గంటల హోటల్. అంటే రాత్రి పూట పడుకోవడానికి, పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా సెట్ చేశారు. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సిందే(చెక్ అవుట్). మళ్లీ కంటిన్యూ కావాలంటే మళ్లీ రిజిస్ట్రర్‌లో రికార్డు చేసుకోవాలి. అంతేకాదు పాడ్ హోటల్ కావడంతో ఛాంబర్లో రీసౌండ్ మాత్రం బాగా వస్తది. దీంతో మిగతా ఛాంబర్లకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినా త్వరగా రియాక్ట్ కావడానికి ఛాన్స్ కూడా ఉండదు. మరోవైపు వీటిని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మరిచిపోయి.. కమర్షియల్ పర్పస్‌గా మార్చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా ఛాంబర్స్‌ని మరీ కుదించి ‘మార్చురీ’ టైప్‌లో డిజైన్స్ చేస్తున్నారని జపాన్ ఆర్టిటెక్ అసోషియేషన్ ఒక వాదనను వినిపించింది. ఇవన్నీ పక్కనపెడితే.. కంఫర్ట్ కోసం వెతుక్కునే వాళ్లకు అన్నివిధాల చీప్ అండ్ బెస్ట్ ఈ క్యాప్సుల్ హోటల్స్.
మన దగ్గర కూడా..
జపాన్ నుంచి మొదలైన ఈ హోటల్ ట్రెండ్.. చైనా, ఇండోనేసియా, ఇండియా, హాంకాంగ్, బెల్జియం, పోలాండ్స్కి విస్తరించాయి. యూరోప్‌లో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరల్లో క్యాప్సూల్స్ హోటల్స్ కనిపిస్తాయి. మన దేశంలోనూ క్యాప్సుల్ హోటల్ని ‘అర్బన్ పాడ్’ పేరుతో ముంబైలోని అంధేరీ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఒక హోటల్లో ఉండే బెనిఫిట్సే ఇందులోనూ అందుతాయి. పైగా రేటు కూడా రీజనబుల్. దీంతో ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా టూరిస్టుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో దేశంలో మరిన్ని చోట్ల క్యాప్సుల్ హోటల్స్‌ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.