poker gang
-
పొంచి ఉన్న ‘పోకర్’ ప్రమాదం
సాక్షి, సిటీబ్యూరో: పేకాట... అది నేరుగానే కాదు ఆన్లైన్లో ఆడినా బతుకులు ఛిద్రం చేస్తుందనడానికి తాజా ఉదాహరణ ఈ ఉదంతం. ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న పోకర్ ‘ప్రమాదానికి గురై’ సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అతడిని పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారించగా ఆన్లైన్లో విస్తరిస్తున్న ‘పోకర్’ జాడ్యం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్, కిమ్స్ ఆస్పత్రి సమీపంలోని ఆదిత్య టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.22 లక్షల నగదు, పోకర్ యాప్స్‌తో కూడిన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. ప్లేస్టోర్స్ నుంచి సెల్ఫోన్లలోకి... ‘పోకర్’ యాప్ ప్లేస్టోర్స్‌లో అందుబాటులో ఉంటోంది. బహదూర్‌పురాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నౌషద్ అలీ దీనిని డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో ఆరుగురిని సభ్యులుగా నియమించుకుంటూ గ్రూపు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో నౌషద్ 30 మందితో ఐదుగ్రూపులు క్రియేట్ చేశాడు. ఇందులో మేడ్ ఓవర్ పోకర్ (ఎంఓపీ) పేరుతో ఉన్న దాంట్లో హిమాయత్‌నగర్‌కు చెందిన సుధీర్, బేగంబజార్ వాసి గోపాల్ కబ్రా, పీజీ రోడ్‌కు చెందిన నదీమ్ సర్సానీ, మల్కాజ్గిరి వాసి భరత్ చౌదరి, చార్మినార్‌కు చెందిన రాజ్‌కుమార్ భండారీ సభ్యులుగా ఉన్నారు. మిగిలిన గ్రూపుల్లోనూ నౌషద్ పరిచయస్తులు, పరిచయం లేని వాళ్లను చేర్చాడు. వీరందరి ఫోన్లలోనూ ఈ యాప్ ఉంటుంది. ఓ గ్రూప్‌లో ఉన్న ఆరుగురు సభ్యులకు నౌషద్ ఐపీలు క్రియేట్ చేసి ఇస్తాడు. వీటి ద్వారా వారు ఓ గేమ్‌లోకి ఎంటర్ కావచ్చు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఐపీతో లాగినై పేకాట మొదలెట్టవచ్చు. మూడు ముక్కలాట తరహాలో నాలుగు ముక్కలతో ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’ ఆట ఆడతారు. ఏ సభ్యుడు ఎంత పందెం కాశాడు? ఎవరు గెలిచారు? తదితర అంశాలు అడ్మిన్‌గా ఉండే నౌషద్‌కు తెలుస్తూనే ఉంటాయి. ఒక రోజు గెలుపొటములకు సంబంధించిన డబ్బును రెండో రోజు వ్యక్తిగతంగా కలిసి మార్పిడి చేసుకునేవారు. ప్రతి గేమ్ నుంచి నౌషద్‌కు ఐదు శాతం కమీషన్ వస్తుంటుంది. ఇలాంటి అడ్మిన్లు, గ్రూప్‌ల సంఖ్య పోకర్‌లో వేలు, లక్షల్లోనే ఉంటోంది. సర్వం కోల్పోతున్న వారు ఎందరో... ఈ ఆన్లైన్ జూదంలో పోలీసులు దాడి చేస్తారనో, ఎవరైనా చూస్తారనో భయం లేదు. దీంతో అనేక మంది పోకర్‌ను డౌన్లోడ్ చేసుకుని సర్వం కోల్పోతున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన సుధీర్ నౌషద్ ద్వారా ఈ రొంపిలోకి దిగాడు. కొన్ని రోజుల్లోనే రూ.30 లక్షలు నష్టపోయాడు. ఇంట్లో ఉన్న డబ్బు పోగా... ఉన్న బంగారాన్నీ అమ్ముకున్నాడు. చివరకు కొన్ని రోజుల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ మిస్సింగ్ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ముంబైలో సుధీర్ ఆచూకీ గుర్తించి నగరానికి తీసుకువచ్చారు. ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణాలపై ఆరా తీయగా ఎంఓపీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రూపు సభ్యులు ప్రతిరోజూ నదీమ్‌కు చెందిన ఆదిత్య టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్ద కలిసి డబ్బు ఇచ్చిపుచ్చుకుంటారని తెలుసుకున్నారు. అక్కడ మాటు వేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం నౌషద్, గోపాల్, నదీమ్, భరత్, రాజ్‌కుమార్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం రాంగోపాల్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఆన్లైన్ జూదగాళ్లు ఇంకా ఉన్నారనే సమాచారంతో నిఘా ముమ్మరం చేశారు. చట్ట ప్రకారం పోకర్ లాంటి జూదాలు ఆడే వారినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అనంతపురం జిల్లాలో పేకాటరాయుళ్ళు అరెస్ట్
-
పేకాట సామ్రాజ్యం కూల్చేస్తాం!
మహబూబ్‌నగర్ క్రైం : పేకాట రాయుళ్లు తీరు మార్చుకోవాలని.. లేకపోతే ఎంతటి వారైనా దాడులు చేసి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ డీఎస్పీ సాయి మనోహర్ హెచ్చరించారు. ఆదివారం హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తచెరువుతండా అడవిలో పేకాట అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విలేకరులకు వివరించారు. పేకాట రాయుళ్లది పెద్ద సామ్రాజ్యమే ఉందని, ప్రతి ఆదివారం పక్కా ప్లాన్‌తో పేకాట ఆడటానికి ప్రణాళిక రచిస్తారని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 1న హన్వాడ పరిధిలోని కొత్త చెరువు తాండ సమీపంలో ఉన్న అటవి ప్రాంతంలో అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో దాడులు జరిగాయని చెప్పారు. ఈ దాడులలో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా బాలరాజు అలియాస్ బాలు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇతడు శివ అనే వ్యక్తితో పేకాట రాయుళ్లకు సమాచారం అందిస్తూ కావాల్సిన ఏర్పాటు చేస్తాడని, పద్ధతి మార్చుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో దాడులు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 16మంది ఉన్నారని, వారిలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ జావేద్ కూడా ఉన్నట్లు నిర్దారణ కావడంతో అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారిని రిమాండ్ చేయడంతో పాటు రూ.లక్షా 21 నగదు, 10ద్విచక్ర వాహనాలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదైన వారిలో పల్లె వంశీ, పాష, సయ్యద్ మెహిజ్, సతీష్, సలాన్, రాజు, తిరుపతయ్య, నర్సింహులు, చంద్రనారాయణ్, వెంకటస్వామి, రాఘవేందర్, నాగరాజు, వెంకటేష్, శంకర్‌నాయక్, శివ, బాలరాజు ఉన్నారు. కానిస్టేబుల్ జావేద్ పరారీలో ఉన్నాడు. సమావేశంలో రూరల్ సీఐ కిషన్, హన్వాడ ఎస్ఐ రాంబాబు ఉన్నారు. -
పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. రాయదుర్గం సమీపంలోని మల్లాపురం క్రాస్‌రోడ్డులో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.