పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, సిటీబ్యూరో: పేకాట... అది నేరుగానే కాదు ఆన్‌లైన్‌లో ఆడినా బతుకులు ఛిద్రం చేస్తుందనడానికి తాజా ఉదాహరణ ఈ ఉదంతం. ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న పోకర్ ‘ప్రమాదానికి గురై’ సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అతడిని పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారించగా ఆన్‌లైన్‌లో విస్తరిస్తున్న ‘పోకర్’ జాడ్యం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్, కిమ్స్ ఆస్పత్రి సమీపంలోని ఆదిత్య టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.22 లక్షల నగదు, పోకర్ యాప్స్‌తో కూడిన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు.
ప్లేస్టోర్స్ నుంచి సెల్‌ఫోన్లలోకి...
‘పోకర్’ యాప్ ప్లేస్టోర్స్‌లో అందుబాటులో ఉంటోంది. బహదూర్‌పురాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నౌషద్ అలీ దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో ఆరుగురిని సభ్యులుగా నియమించుకుంటూ గ్రూపు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో నౌషద్ 30 మందితో ఐదుగ్రూపులు క్రియేట్ చేశాడు. ఇందులో మేడ్ ఓవర్ పోకర్ (ఎంఓపీ) పేరుతో ఉన్న దాంట్లో హిమాయత్‌నగర్‌కు చెందిన సుధీర్, బేగంబజార్ వాసి గోపాల్ కబ్రా, పీజీ రోడ్‌కు చెందిన నదీమ్ సర్సానీ, మల్కాజ్‌గిరి వాసి భరత్ చౌదరి, చార్మినార్‌కు చెందిన రాజ్‌కుమార్ భండారీ సభ్యులుగా ఉన్నారు. మిగిలిన గ్రూపుల్లోనూ నౌషద్ పరిచయస్తులు, పరిచయం లేని వాళ్లను చేర్చాడు. వీరందరి ఫోన్లలోనూ ఈ యాప్ ఉంటుంది. ఓ గ్రూప్‌లో ఉన్న ఆరుగురు సభ్యులకు నౌషద్ ఐపీలు క్రియేట్ చేసి ఇస్తాడు. వీటి ద్వారా వారు ఓ గేమ్‌లోకి ఎంటర్ కావచ్చు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఐపీతో లాగినై పేకాట మొదలెట్టవచ్చు. మూడు ముక్కలాట తరహాలో నాలుగు ముక్కలతో ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’ ఆట ఆడతారు. ఏ సభ్యుడు ఎంత పందెం కాశాడు? ఎవరు గెలిచారు? తదితర అంశాలు అడ్మిన్‌గా ఉండే నౌషద్‌కు తెలుస్తూనే ఉంటాయి. ఒక రోజు గెలుపొటములకు సంబంధించిన డబ్బును రెండో రోజు వ్యక్తిగతంగా కలిసి మార్పిడి చేసుకునేవారు. ప్రతి గేమ్ నుంచి నౌషద్‌కు ఐదు శాతం కమీషన్ వస్తుంటుంది. ఇలాంటి అడ్మిన్‌లు, గ్రూప్‌ల సంఖ్య పోకర్‌లో వేలు, లక్షల్లోనే ఉంటోంది.
సర్వం కోల్పోతున్న వారు ఎందరో...
ఈ ఆన్‌లైన్ జూదంలో పోలీసులు దాడి చేస్తారనో, ఎవరైనా చూస్తారనో భయం లేదు. దీంతో అనేక మంది పోకర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సర్వం కోల్పోతున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన సుధీర్ నౌషద్ ద్వారా ఈ రొంపిలోకి దిగాడు. కొన్ని రోజుల్లోనే రూ.30 లక్షలు నష్టపోయాడు. ఇంట్లో ఉన్న డబ్బు పోగా... ఉన్న బంగారాన్నీ అమ్ముకున్నాడు. చివరకు కొన్ని రోజుల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ మిస్సింగ్ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ముంబైలో సుధీర్ ఆచూకీ గుర్తించి నగరానికి తీసుకువచ్చారు. ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణాలపై ఆరా తీయగా ఎంఓపీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రూపు సభ్యులు ప్రతిరోజూ నదీమ్‌కు చెందిన ఆదిత్య టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్ద కలిసి డబ్బు ఇచ్చిపుచ్చుకుంటారని తెలుసుకున్నారు. అక్కడ మాటు వేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం నౌషద్, గోపాల్, నదీమ్, భరత్, రాజ్‌కుమార్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం రాంగోపాల్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఆన్‌లైన్ జూదగాళ్లు ఇంకా ఉన్నారనే సమాచారంతో నిఘా ముమ్మరం చేశారు. చట్ట ప్రకారం పోకర్ లాంటి జూదాలు ఆడే వారినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment