polavaram niravasitulu
-
డబ్బులు మిగుల్చుకోవాలని కాదు.. అర్హులు మిగలకూడదనే తపన!
సాక్షి, విశాఖపట్నం: ‘మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన మాత్రమే ఉంది. మీ జగన్‌లో కల్మషం లేదు.. ఎప్పుడైనా సరే మంచి చేయడం కోసమే ఆరాట పడతాడని, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నికలకు వెళ్లేలోపు ఆరేడు నెలల్లో పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ప్యాకేజీ అందుతుంది. మీ బిడ్డ మీకోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. లైడార్ సర్వేతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. గత పాలకులకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ బాధితులను కలుసుకుని పరామర్శించారు. క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను స్వయంగా పరిశీలించారు. సీఎం జగన్ తొలుత ఉదయం 10.50 గంటలకు కూనవరం మండలం కోతులగుట్టకు హెలికాప్టర్లో చేరుకున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం కూనవరం బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తరువాత పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో పూర్తిగా దెబ్బతిన్న గొమ్ముగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫొటోల కోసం నా చుట్టూ తిప్పుకోకుండా.. వారం క్రితం గోదావరి పొంగి ప్రవహించడంతో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కలెక్టర్ సుమిత్కుమార్ను ముందుగానే అప్రమత్తం చేశాం. అధికారులకు కావాల్సిన వనరులను సమకూర్చి వారం పాటు సహాయ కార్యక్రమాలను ఏమాత్రం అలసత్వం లేకుండా నిర్వహించాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయాల నుంచి వలంటీర్ల దాకా అందరినీ యాక్టివేట్ చేశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా పర్యటించి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు తగినన్ని నిధులు, సమయం ఇచ్చి సహాయ చర్యల్లో యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేశాం. వారం రోజుల్లో వారంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా బాధితులందరికీ సహాయం అందించే కార్యక్రమాలు జరిగాయి. అధికార యంత్రాంగాన్ని నా చుట్టూ తిప్పుకోకుండా బాధితుల వద్దకు పంపించి సహాయ చర్యలను సమర్థంగా పర్యవేక్షించాం. ఇంతకు ముందూ ఇదే చేశాం.. ఇప్పుడూ చేస్తున్నాం. సాయం అందకుంటే చెప్పండి మీ కలెక్టర్ బాగా పని చేశారా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు. మీకు జరగాల్సిన మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే నేరుగా నాకు చెప్పవచ్చు. ఇంత గొప్పగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయపడే ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయమే ఉంది. ఇళ్లలోకి నీళ్లు వస్తే బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు చొప్పున అందించాం. అలా జరగకపోతే నాకు చెప్పవచ్చు. ఇళ్లలోకి నీళ్లు రాకపోయినప్పటికీ గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు లాంటి ఐదు రకాలు కలిపి ఇవ్వాలని సూచించాం. బాధితులు ఎవరికైనా అందకపోతే చెప్పవచ్చు. ప్రభుత్వం దానికి జవాబుదారీతనం తీసుకుంటుంది. పొరపాటున పేరు లేకపోతే.. కచ్చా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బ తిన్నాయనే వ్యత్యాసం ఉండకూడదని చెప్పాం. పేదల పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపవద్దని, నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. ఒకవేళ ఎన్యుమరేషన్ ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే అవుతుంది. నష్టం జరిగినా పొరపాటున జాబితాలో పేరు లేకపోతే వెంటనే అందులో చేర్చి మంచి జరిపించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు. ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా.. ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దాన్ని తీర్చడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ ఈ పద్ధతిలోనే జరిగిపోతాయి. వరద సమయంలో మీకు ఎలా సాయం అందింది? కలెక్టర్ ఎలా చేశారో మీరే చెప్పారు. కూనవరం ఎస్ఐ వెంకటేశ్ గురించి మంచి విషయాలు విన్నా. గొప్పగా ఆదుకున్నారని విన్నా. ఆగస్టు 15న ఇచ్చే పతకాల్లో ఆయన పేరు ఉండాలని కలెక్టర్‌కు సూచించా. అధికారులను నిలదీసేందుకు రాలేదు నేను ఇక్కడకు అధికారులను నిలదీయడానికి రాలేదు. అధికారులను శభాష్ అని వెన్ను తట్టేందుకు, మీ దగ్గర నుంచి మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. కలెక్టర్ మాత్రమే కాకుండా ఎస్పీ నుంచి ఎస్ఐ దాకా సచివాలయ సిబ్బంది నుంచి వలంటీర్ దాకా రెవెన్యూ సిబ్బంది నుంచి మొత్తం అందరూ బాగా కష్టపడ్డారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. సీఎం పర్యటనలో హోంమంత్రి తానేటి వనిత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్షి్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
16 వేలమంది శాశ్వత నివాసాలకు తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నామని ప్రాజెక్టుల పరిహారం, పునరావాస జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఆర్‌ఆర్)కి ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. నిర్వాసితుల కోసం రాడార్ సర్వే చేస్తున్నామని, 16 వేలమందిని శాశ్వత నివాసాలకు తరలించామని చెప్పారు. ఎన్‌ఎంసీఆర్‌ఆర్ చైర్మన్ అజయ్టిర్కీ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వ అధికారులు, ఫిర్యాదీ పెంటపాటి పుల్లారావు, న్యాయవాది శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తమ రాష్ట్రంలో 373 గ్రామాలను తరలించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. కాఫర్‌డ్యాం వల్ల ముంపు అంటూ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. ప్రాజెక్టు ప్రభావం పడే ప్రజల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. నిర్వాసితుల త్యాగాలు గుర్తించి రూ.3 లక్షల చొప్పున అదనంగా ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. నిర్వాసితులను ఆదుకోవడానికి చర్యలు చేపడుతుంటే ఫిర్యాదులు, కేసులతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇంకా బహిరంగ విచారణ పూర్తికాలేదని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు. ముంపు ఎంత అని తేలిన తర్వాత కరకట్టలు నిర్మించి ఆయా వివరాలన్నీ కమిటీకి అందజేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులపై ప్రభావం గుర్తించడానికి జలశక్తి, సామాజిక న్యాయ, గిరిజన శాఖలతో కమిటీ వేసినప్పటికీ కరోనా వల్ల పరిశీలించలేదని ఫిర్యాదీ పెంటపాటి పుల్లారావు, న్యాయవాది శ్రావణ్‌కుమార్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. విలువైన భూములకు తగిన విధంగా పరిహారం అందడం లేదని, నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారని చెప్పారు. నిర్వాసితులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.నిర్వాసితులను బలవంతంగా తరలించడంలేదని ఏపీ అధికారులు తెలిపారు. అనంతరం నిర్వాసితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు కమిటీ చైర్మన్ సూచించారు. ఫిర్యాదులోని అంశాలపై పాయింట్ల వారీగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. -
‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరానికి సంబంధించిన అన్ని పనులపై పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులకు అందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మీద చర్చించారు. ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగానే కొనసాగుతోందని, సవరించిన అంచనాల ప్రకారం దీని కోసం 32 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే మరిన్ని అభ్యర్థనలు బట్టి ప్యాకేజీ విషయంలో చర్చిస్తామని తెలియజేశారు. పోలవరం వరద ముంపుపై చర్చ జరుగుతోందని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస బాధితులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
పరిహారం పల్లమెరగదే!
నీరు పల్లమెరుగు అంటారు.. కానీ పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఈ నిజాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. భూములు ముంపు ప్రాంత పరిధిలో ఉన్నా.. పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో నిర్వాసితులు ఆందోళనచెందుతున్నారు. చుట్టూ ఉన్నభూములకు పరిహారం ఇచ్చి మధ్యలో భూములను వదిలేయడం విచిత్రం. వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా సర్వస్వం కోల్పోతున్న గిరిజనం అధికారుల చేతిలో అడుగడుగునా మోసపోతున్నారు. వారి నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికార యంత్రాంగం తీవ్ర అన్యాయం చేస్తోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుంటుంబాలు ఉన్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలు ఉండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. భూసేకరణలో భాగంగా ఇప్పటి వరకు 25 వేల ఎకరాలు సేకరించారు. ఇందులో భూమికి బదులు భూమి కింద గిరిజనులకు 5,365 ఎకరాల భూమి చూపించారు. ఈ రెండు మండలాల్లో గిరిజనులకు చెందిన సుమారు మరో 800 ఎకరాల భూమి మిగిలిపోయింది. సుమారు 500 మంది గిరిజన నిర్వాసిత రైతులకు చెందిన ఈ భూములు ముంపు పరిధిలో లేవంటూ పరిహారం నిలిపివేశారు. ఈ భూముల చుట్టూ ఉన్న భూములకు పరిహారమిచ్చి మధ్యలో ఉన్న భూములు ముంపులో లేవంటూ పరిహారమివ్వలేదు. ఇక్కడే ఉన్న ఇళ్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితాలో ముంపులో ఉన్నట్లు ప్రకటించి అవార్డు కూడా పాస్ చేశారు. కాని అక్కడే ఉన్న భూములు మాత్రం ముంపులో లేనట్లు ప్రకటించడాన్ని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోంది. మెరక ప్రాంతం ముంపులోనట.. పల్లపు ప్రాంతం మాత్రం కాదట వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము రెవెన్యూలోని పాతపూచిరాల గ్రామంలో ఇళ్లన్నీ మునుగుతాయని ఆర్అండ్ఆర్ జాబితాలో ఈ గ్రామాన్ని చేర్చారు. ఇక్కడి గిరిజనులకు ఇళ్ల ప్యాకేజీతోపాటు, వ్యక్తిగత ప్యాకేజీ కూడా మంజూరైంది. పొలాల్లో ఉన్న ఇళ్లు మునుగుతాయని ఇళ్ల ప్యాకేజీ మంజూరు చేసిన అధికారులు అక్కడే ఉన్న పొలాలు మాత్రం మునగవని సర్వే చేయకుండా వదిలేశారు. 1986లో గోదావరి వరదలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. దీనికి 2 కిలోమీటర్ల దూరంలోని ఎగువ ప్రాంతంలో ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) స్టోన్స్ ఉన్నాయి. ఎఫ్ఆర్ఎల్ స్టోన్స్ లోపల ఉన్న తూట్కూరుగొమ్ము రెవెన్యూలో వసంతవాడ ప్రాంత భూములకు భూనష్ట పరిహారం చెల్లించారు. అయినప్పటికీ దిగువలో ఉన్న ఈ పొలాలు ముంపు పరిధిలోకి ఎలా రావో సర్వే అధికారులే నిగ్గుతేల్చాల్సి ఉంది. అలాగే సిద్ధారం, కట్కూరు, కొత్తూరు, చిగురుమామిడి, నార్లవరం, తిర్లాపురం, తాట్కూరుగొమ్ము, రాళ్ళపుడి, రామవరం రెవెన్యూల్లో వందలాది ఎకరాల భూములు ముంపులోనే ఉన్నాయి. పాత దాచారాన్నే వదిలేశారు కుక్కునూరు మండలం పాత దాచారం రెవెన్యూలో 96 సర్వే నంబర్లో 90 ఎకరాలు ముంపులో ఉన్నప్పటికీ ఈ భూములను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ భూములకు ఎగువ ప్రాంతంలో నల్లగుంట, గుండేటివాగు వంతెనకు చేరువలో భూములను ముంపులోకి తీసుకున్నారు. ముంపు ప్రాంతం గుర్తించడంలో అధికారులు చేసిన తప్పిదాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. ఇంకా చాలా తప్పులు ఉన్నాయని గిరిజనులు వాపోతున్నారు. న్యాయం జరిగేలా చూస్తా నిజంగా భూములు ముంపులో ఉంటే విచారించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తా. రేపాగొమ్ము రెవెన్యూలో మిగిలిపోయిన గిరి జనుల భూముల రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటా. ఇళ్లు ముంపులో ఉండి, పొలాలు ముంపులో లేకుండా ఉంటే ఆ భూములు కూడా పరిశీలించి పరిహారం అందేలా చూస్తా. – హరీంద్రియ ప్రసాద్, పోలవరం భూసేకరణ అధికారి, ఐటీడీఏ పీఓ ఆర్ అండ్ ఆర్‌లో మంజూరు.. భూసేకరణలో నిరాకరణ ఈ గిరిజనుడి పేరు మచ్చా చంద్రయ్య. పాతపూచిరాల గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో 218 సర్వే నంబర్లో 4ఎకరాల 14 కుంటల భూమి ఉంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ఎస్ఈఎస్ నెంబర్ 281తో ప్యాకేజీ మంజూరు లభించింది. అక్కడే ఉన్న వ్యవసాయ భూమికి పరిహారం ఇవ్వలేదు. అదేమంటే ముంపులో లేదనే సాకు చూపారు. చంద్రయ్య పొలానికి ఎగువ ప్రాంతంలో ఉన్న తాట్కూరుగొమ్ము రెవెన్యూలో 371, 285, 259 సర్వే నంబర్ల భూమికి భూనష్ట పరిహారం అందించారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయం చుట్టూ చంద్రయ్య తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యహరిస్తున్నారు. ఇళ్లు మునుగుతాయట.. ఆనుకుని ఉన్న పొలాలు మాత్రం సురక్షితమట ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ గిరిజన మహిళ పేరు పొట్ల బుచ్చెమ్మ. పాతపూచిరాల గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో సర్వే నంబర్ 218లో 3 ఎకరాల 20 కుంటలు, 246లో 26 కుంటలు, మొత్తం 4ఎకరాల 6 కుంటల పట్టా భూమి ఈమె పేర ఉంది. దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి సాగుచేసుకుంటోంది. పొలంలోనే ఈమె ఇల్లు నిర్మించుకుంది. ఆర్అండ్ఆర్ ఇళ్ల జాబితాలో సీ బ్లాక్‌లో ఎస్ఈఎస్ నంబర్ 287 పేరున ఇళ్ల పరిహారంతోపాటు, వ్యక్తిగత ప్యాకేజీ మంజూరైంది. బుచ్చమ్మ ఇంటికి పక్కనే ఉన్న కొడుకు పొట్ల సింగయ్య ఇంటికి ఎస్ఈఎస్ నంబర్ 288తో ప్యాకేజీ మంజూరైంది. పొలం మాత్రం మునగదని అధికారులు తేల్చారు. ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించినా భూసేకరణ అధికారులు పట్టించుకోవడంలేదు. రికార్డులు పరిశీలిస్తామని ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. -
ఇళ్లు కూలగొట్టారు.. అద్దెలు ఎగ్గొట్టారు
అడవి తల్లి ఒడిలో వాళ్లు కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం పడగొట్టించింది. వారికి పునరావాసం కల్పించకుండా ఊరు విడిచి పోవాలంటూ తరిమేసింది. అదేమని అడిగితే.. త్వరలోనే సొంతిళ్లు కట్టిస్తామని.. అప్పటివరకూ అద్దె ఇళ్లల్లో ఉండాలని హుకుం జారీ చేసింది. తమకంత స్థోమత లేదని సొంతూరులోనే ఏదోమూల బతుకీడుస్తామంటే.. అద్దె తామే కడతామని నమ్మబలికింది. సర్కారు మాటల్ని నమ్మి పొరుగూళ్లకు వెళ్లి తలదాచుకుంటున్న ఆ కుటుంబాలకు మూడు నెలలుగా అద్దె సొమ్ము చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది. పోలవరం :‘వెంటనే ఊళ్లను ఖాళీ చేయండి. మీకు ఇళ్లు కట్టి ఇచ్చే వరకు అద్దె ఇళ్లల్లోకి ఉండండి. నెలకు రూ.మూడు వేల చొప్పున అద్దె చెల్లిస్తాం. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం’ అని ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు మాట ఇచ్చారు. వాళ్ల మాటల్ని నమ్మి పోలవరంలోని ఇటుకలకోట రోడ్డులో గల పునరావాస కేంద్రాల్లో అద్దె ఇళ్లల్లోకి వచ్చాం. ఇప్పటివరకు అద్దె డబ్బు ఇవ్వలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇంటి యజమానులు వెంటనే అద్దె కట్టండి, లేదంటే ఖాళీ చేయండంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని వాపోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలైన రామయ్యపేట, సింగన్నపల్లి నిర్వాసితులు. రామయ్యపేటకు చెందిన 40 కుటుం బాలు, సింగన్నపల్లికి చెందిన 40 కుటుంబాలు ఇటుకులకోట రోడ్డులోని పునరావాస కేంద్రాల్లో అద్దెకు ఉంటున్నాయి. పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండా అధికారులు ఆయా కుటుంబాల వారిని అద్దె ఇళ్లల్లోకి పంపిం చివేయడంతో ఈ దుస్థితి తలెత్తిందని నిర్వాసితులు చెబుతున్నారు. సింగన్నపల్లి గ్రామస్తులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమదేనని, అప్పటివరకు ఆ కుటుంబాల వారికి నెలనెలా అద్దె చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తామంతా అద్దె ఇళ్లల్లోకి వచ్చి మూడు నెలలు దాటిందని, రెండు నెలల అద్దె చెల్లించలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. రామయ్యపేట నిర్వాసితులకు మూడు నెలల అద్దె చెల్లిస్తామని అధికారులు అభయమిచ్చారు. మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వారికి కట్టిస్తామన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని ఇళ్లకు సంబంధించి అసలు పనులే మొదలు కాలేదు. ఈ పరిస్థితుల్లో అద్దె ఇళ్లల్లో ఎన్నాళ్లు ఉండాలో, ఎన్ని నెలలకు అద్దె చెల్లిస్తారో తెలి యక నిర్వాసితులు సతమమవుతున్నారు. అధికారులు తమను నమ్మించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వారి గురించి పట్టించుకోవడం లేదని నిర్వాసితులు పొన్నాడ దుర్గాప్రసాద్, దత్తి నాగలక్ష్మి తదితరులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నెలవారీ అద్దె చెల్లించడంతోపాటు పునరావాస కేంద్రాల్లో ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తికాకుండానే పొమ్మన్నారు పునరావాస కేంద్రం లో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. గ్రామం విడిచి అద్దె ఇళ్లకు వెళ్లండి.. అద్దెలు ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. ఆ మాట నమ్మి ఇల్లు ఖాళీచేసి అద్దె ఇళ్లల్లోకి వెళ్లాం. మూడు నెలలు దాటిపోయింది. అద్దె ఇవ్వకపోతే యజమానులు తమ ఇళ్లల్లోంచి వెళ్లిపోమంటున్నారు. – కర్రి లక్ష్మణరావు, నిర్వాసితుడు, సింగన్నపల్లి ఒక్కనెల కూడా ఇవ్వలేదు.. అద్దె ఇళ్లల్లోకి వెళ్లండి.. నెలకు రూ. 3వేలు చొప్పున మూడు నెలలపాటు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. తీరా ఇళ్లల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఒక్కనెల అద్దె కూడా ఇవ్వలేదు. ఇదేమని అడిగితే బిల్లు పెట్టాం, రాగానే ఇస్తామన్నారు. అద్దె చెల్లించకపోతే ఇంటి యజమానులు ఊరుకోవడం లేదు.– పోతుల సూర్యప్రకాశరావు, నిర్వాసితుడు, రామయ్యపేట