అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ‘మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన మాత్రమే ఉంది. మీ జగన్‌లో కల్మషం లేదు.. ఎప్పుడైనా సరే మంచి చేయడం కోసమే ఆరాట పడతాడని, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నికలకు వెళ్లేలోపు ఆరేడు నెలల్లో పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ప్యాకేజీ అందుతుంది.
మీ బిడ్డ మీకోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. లైడార్ సర్వేతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. గత పాలకులకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ బాధితులను కలుసుకుని పరామర్శించారు. క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను స్వయంగా పరిశీలించారు. సీఎం జగన్ తొలుత ఉదయం 10.50 గంటలకు కూనవరం మండలం కోతులగుట్టకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.
వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం కూనవరం బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తరువాత పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో పూర్తిగా దెబ్బతిన్న గొమ్ముగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
ఫొటోల కోసం నా చుట్టూ తిప్పుకోకుండా..
వారం క్రితం గోదావరి పొంగి ప్రవహించడంతో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను ముందుగానే అప్రమత్తం చేశాం. అధికారులకు కావాల్సిన వనరులను సమకూర్చి వారం పాటు సహాయ కార్యక్రమాలను ఏమాత్రం అలసత్వం లేకుండా నిర్వహించాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయాల నుంచి వలంటీర్ల దాకా అందరినీ యాక్టివేట్ చేశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం.
వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా పర్యటించి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు తగినన్ని నిధులు, సమయం ఇచ్చి సహాయ చర్యల్లో యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేశాం. వారం రోజుల్లో వారంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా బాధితులందరికీ సహాయం అందించే కార్యక్రమాలు జరిగాయి. అధికార యంత్రాంగాన్ని నా చుట్టూ తిప్పుకోకుండా బాధితుల వద్దకు పంపించి సహాయ చర్యలను సమర్థంగా పర్యవేక్షించాం. ఇంతకు ముందూ ఇదే చేశాం.. ఇప్పుడూ చేస్తున్నాం.
సాయం అందకుంటే చెప్పండి
మీ కలెక్టర్ బాగా పని చేశారా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు. మీకు జరగాల్సిన మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే నేరుగా నాకు చెప్పవచ్చు. ఇంత గొప్పగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయపడే ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయమే ఉంది.
ఇళ్లలోకి నీళ్లు వస్తే బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు చొప్పున అందించాం. అలా జరగకపోతే నాకు చెప్పవచ్చు. ఇళ్లలోకి నీళ్లు రాకపోయినప్పటికీ గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు లాంటి ఐదు రకాలు కలిపి ఇవ్వాలని సూచించాం. బాధితులు ఎవరికైనా అందకపోతే చెప్పవచ్చు. ప్రభుత్వం దానికి జవాబుదారీతనం తీసుకుంటుంది.
పొరపాటున పేరు లేకపోతే..
కచ్చా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బ తిన్నాయనే వ్యత్యాసం ఉండకూడదని చెప్పాం. పేదల పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపవద్దని, నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. ఒకవేళ ఎన్యుమరేషన్ ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే అవుతుంది. నష్టం జరిగినా పొరపాటున జాబితాలో పేరు లేకపోతే వెంటనే అందులో చేర్చి మంచి జరిపించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు.
ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా..
ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దాన్ని తీర్చడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ ఈ పద్ధతిలోనే జరిగిపోతాయి. వరద సమయంలో మీకు ఎలా సాయం అందింది? కలెక్టర్ ఎలా చేశారో మీరే చెప్పారు. కూనవరం ఎస్‌ఐ వెంకటేశ్ గురించి మంచి విషయాలు విన్నా. గొప్పగా ఆదుకున్నారని విన్నా. ఆగస్టు 15న ఇచ్చే పతకాల్లో ఆయన పేరు ఉండాలని కలెక్టర్‌కు సూచించా.
అధికారులను నిలదీసేందుకు రాలేదు
నేను ఇక్కడకు అధికారులను నిలదీయడానికి రాలేదు. అధికారులను శభాష్ అని వెన్ను తట్టేందుకు, మీ దగ్గర నుంచి మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. కలెక్టర్ మాత్రమే కాకుండా ఎస్పీ నుంచి ఎస్‌ఐ దాకా సచివాలయ సిబ్బంది నుంచి వలంటీర్ దాకా రెవెన్యూ సిబ్బంది నుంచి మొత్తం అందరూ బాగా కష్టపడ్డారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా.
ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. సీఎం పర్యటనలో హోంమంత్రి తానేటి వనిత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్షి్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment