పాతపూచిరాలలోని ఈ ఇళ్లు మంపునకు గురవుతాయట.. ఆ పక్కనే పొలాలు ముంపులో లేవట.. చిత్రంలో రెంటినీ చూడవచ్చు.
నీరు పల్లమెరుగు అంటారు.. కానీ పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఈ నిజాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. భూములు ముంపు ప్రాంత పరిధిలో ఉన్నా.. పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో నిర్వాసితులు ఆందోళనచెందుతున్నారు. చుట్టూ ఉన్నభూములకు పరిహారం ఇచ్చి మధ్యలో భూములను వదిలేయడం విచిత్రం.
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా సర్వస్వం కోల్పోతున్న గిరిజనం అధికారుల చేతిలో అడుగడుగునా మోసపోతున్నారు. వారి నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికార యంత్రాంగం తీవ్ర అన్యాయం చేస్తోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుంటుంబాలు ఉన్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలు ఉండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. భూసేకరణలో భాగంగా ఇప్పటి వరకు 25 వేల ఎకరాలు సేకరించారు. ఇందులో భూమికి బదులు భూమి కింద గిరిజనులకు 5,365 ఎకరాల భూమి చూపించారు. ఈ రెండు మండలాల్లో గిరిజనులకు చెందిన సుమారు మరో 800 ఎకరాల భూమి మిగిలిపోయింది. సుమారు 500 మంది గిరిజన నిర్వాసిత రైతులకు చెందిన ఈ భూములు ముంపు పరిధిలో లేవంటూ పరిహారం నిలిపివేశారు. ఈ భూముల చుట్టూ ఉన్న భూములకు పరిహారమిచ్చి మధ్యలో ఉన్న భూములు ముంపులో లేవంటూ పరిహారమివ్వలేదు. ఇక్కడే ఉన్న ఇళ్లకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జాబితాలో ముంపులో ఉన్నట్లు ప్రకటించి అవార్డు కూడా పాస్ చేశారు. కాని అక్కడే ఉన్న భూములు మాత్రం ముంపులో లేనట్లు ప్రకటించడాన్ని బట్టి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోంది.
మెరక ప్రాంతం ముంపులోనట.. పల్లపు ప్రాంతం మాత్రం కాదట
వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము రెవెన్యూలోని పాతపూచిరాల గ్రామంలో ఇళ్లన్నీ మునుగుతాయని ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో ఈ గ్రామాన్ని చేర్చారు. ఇక్కడి గిరిజనులకు ఇళ్ల ప్యాకేజీతోపాటు, వ్యక్తిగత ప్యాకేజీ కూడా మంజూరైంది. పొలాల్లో ఉన్న ఇళ్లు మునుగుతాయని ఇళ్ల ప్యాకేజీ మంజూరు చేసిన అధికారులు అక్కడే ఉన్న పొలాలు మాత్రం మునగవని సర్వే చేయకుండా వదిలేశారు. 1986లో గోదావరి వరదలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. దీనికి 2 కిలోమీటర్ల దూరంలోని ఎగువ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) స్టోన్స్ ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌ఎల్ స్టోన్స్ లోపల ఉన్న తూట్కూరుగొమ్ము రెవెన్యూలో వసంతవాడ ప్రాంత భూములకు భూనష్ట పరిహారం చెల్లించారు. అయినప్పటికీ దిగువలో ఉన్న ఈ పొలాలు ముంపు పరిధిలోకి ఎలా రావో సర్వే అధికారులే నిగ్గుతేల్చాల్సి ఉంది. అలాగే సిద్ధారం, కట్కూరు, కొత్తూరు, చిగురుమామిడి, నార్లవరం, తిర్లాపురం, తాట్కూరుగొమ్ము, రాళ్ళపుడి, రామవరం రెవెన్యూల్లో వందలాది ఎకరాల భూములు ముంపులోనే ఉన్నాయి.
పాత దాచారాన్నే వదిలేశారు
కుక్కునూరు మండలం పాత దాచారం రెవెన్యూలో 96 సర్వే నంబర్‌లో 90 ఎకరాలు ముంపులో ఉన్నప్పటికీ ఈ భూములను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ భూములకు ఎగువ ప్రాంతంలో నల్లగుంట, గుండేటివాగు వంతెనకు చేరువలో భూములను ముంపులోకి తీసుకున్నారు. ముంపు ప్రాంతం గుర్తించడంలో అధికారులు చేసిన తప్పిదాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. ఇంకా చాలా తప్పులు ఉన్నాయని గిరిజనులు వాపోతున్నారు.
న్యాయం జరిగేలా చూస్తా
నిజంగా భూములు ముంపులో ఉంటే విచారించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తా. రేపాగొమ్ము రెవెన్యూలో మిగిలిపోయిన గిరి జనుల భూముల రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటా. ఇళ్లు ముంపులో ఉండి, పొలాలు ముంపులో లేకుండా ఉంటే ఆ భూములు కూడా పరిశీలించి పరిహారం అందేలా చూస్తా. – హరీంద్రియ ప్రసాద్, పోలవరం భూసేకరణ అధికారి, ఐటీడీఏ పీఓ
ఆర్ అండ్ ఆర్‌లో మంజూరు.. భూసేకరణలో నిరాకరణ
ఈ గిరిజనుడి పేరు మచ్చా చంద్రయ్య. పాతపూచిరాల గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో 218 సర్వే నంబర్‌లో 4ఎకరాల 14 కుంటల భూమి ఉంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో ఎస్‌ఈఎస్ నెంబర్ 281తో ప్యాకేజీ మంజూరు లభించింది. అక్కడే ఉన్న వ్యవసాయ భూమికి పరిహారం ఇవ్వలేదు. అదేమంటే ముంపులో లేదనే సాకు చూపారు. చంద్రయ్య పొలానికి ఎగువ ప్రాంతంలో ఉన్న తాట్కూరుగొమ్ము రెవెన్యూలో 371, 285, 259 సర్వే నంబర్ల భూమికి భూనష్ట పరిహారం అందించారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయం చుట్టూ చంద్రయ్య తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యహరిస్తున్నారు.
ఇళ్లు మునుగుతాయట.. ఆనుకుని ఉన్న పొలాలు మాత్రం సురక్షితమట
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ గిరిజన మహిళ పేరు పొట్ల బుచ్చెమ్మ. పాతపూచిరాల గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో సర్వే నంబర్ 218లో 3 ఎకరాల 20 కుంటలు, 246లో 26 కుంటలు, మొత్తం 4ఎకరాల 6 కుంటల పట్టా భూమి ఈమె పేర ఉంది. దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి సాగుచేసుకుంటోంది. పొలంలోనే ఈమె ఇల్లు నిర్మించుకుంది. ఆర్‌అండ్‌ఆర్ ఇళ్ల జాబితాలో సీ బ్లాక్‌లో ఎస్‌ఈఎస్ నంబర్ 287 పేరున ఇళ్ల పరిహారంతోపాటు, వ్యక్తిగత ప్యాకేజీ మంజూరైంది. బుచ్చమ్మ ఇంటికి పక్కనే ఉన్న కొడుకు పొట్ల సింగయ్య ఇంటికి ఎస్‌ఈఎస్ నంబర్ 288తో ప్యాకేజీ మంజూరైంది. పొలం మాత్రం మునగదని అధికారులు తేల్చారు. ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించినా భూసేకరణ అధికారులు పట్టించుకోవడంలేదు. రికార్డులు పరిశీలిస్తామని ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment