Polly Umrigar Award
-
బీసీసీఐ వార్షిక అవార్డులు
-
‘ఆమె ముందు అవార్డు అందుకోవడం ప్రత్యేకం’
బెంగళూరు : తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ముందు అవార్డు అందుకోవడం తనకేంతో ప్రత్యేకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన కోహ్లిని ‘పాలీ ఉమ్రీగర్’ ట్రోఫీలు వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును భారత కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా అందుకోవడం విశేషమైతే.. ఈ కార్యక్రమానికి అనుష్కశర్మ హాజరవ్వడం మరో విశేషం. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘నా భార్య సమక్షంలో అందుకున్న ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. గతేడాది కూడా ఈ అవార్డు అందుకున్నాను. అప్పుడు ఈ అనూభూతి కలగలేదు. ఎందుకంటే అప్పుడు ఆమె లేదు ’ అని తెలిపాడు. 2016-17, 2017-18ల సీజన్లలో కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఈ రెండు సీజన్లకు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచాడు. 2016-17లో 13 టెస్టుల్లో 74 సగటుతో 1332 పరుగులు, 24 వన్డేల్లో 84.22 సగటుతో 1516 పరుగులు చేశాడు. 2017-18 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 టెస్టుల్లో 89.6 సగటుతో 896 పరుగులు చేశాడు. ఇక కోహ్లితో పాటు అన్షుమన్ గైక్వాడ్, సుధా షాలకు ‘సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డులు దక్కాయి. రెండు సీజన్లలో వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లందరూ అవార్డులు అందుకున్నారు. భారత ‘ఎ’ జట్టుతో పాటు ఇంగ్లండ్ వెళ్లిన కృనాల్ పాండ్యా మినహా మిగతా వారంతా స్వయంగా అవార్డులు స్వీకరించారు. అండర్–16 విభాగంలో అత్యుత్తమ ఆటతీరు చూపించిన తెలుగు కుర్రాళ్లు ఠాకూర్ తిలక్ వర్మ (హైదరాబాద్ జట్టు), నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధ్ర జట్టు)లకు దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి ‘జగ్మోహన్ దాల్మియా’ అవార్డు అందించారు. -
ఉమ్రిగర్ అవార్డుకు కోహ్లి ఎంపిక
ముంబై: గత రెండేళ్లుగా అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. కోహ్లితో పాటు.. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. వీరికి జూన్ 12న బెంగళూరు వేదికగా జరగనున్న బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులని అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో అసాధారణ ఆటతీరుతో టీమిండియాకి విజయాల్ని అందించిన కోహ్లి.. 2016-17, 2017-18 సంవత్సరాలకుగానూ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఫలితంగా పాలి ఉమ్రిగర్ అవార్డును కోహ్లికి అందజేయనున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. మరొకవైపు ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టుని ఫైనల్‌కి చేర్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ 2016-17కి ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ స్మృతి మంధాన 2017-18 ఏడాదికిగానూ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికైంది. ‘బీసీసీఐ అవార్డులని గెలుచుకున్న క్రీడాకారులకి నా అభినందనలు. గత రెండేళ్లుగా భారత పురుషులు, మహిళల జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. వారి విజయాల్ని చూసి మేము గర్వపడుతున్నాం’ అని బీసీసీఐ పరిపాలక కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. -
కోహ్లికి పాలీ ఉమ్రీగర్ పురస్కారం
అశ్విన్‌కు దిలీప్ సర్దేశాయ్ అవార్డు బీసీసీఐ అవార్డుల ప్రకటన ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రీగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడికి ఈ అవార్డును అందజేస్తారు. 2015–16 సీజన్‌కు గాను బీసీసీఐ వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 2011–12, 2014–15లో కూడా ఉమ్రీగర్ అవార్డును గెలుచుకున్న కోహ్లి, మూడుసార్లు దీనికి ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా నిలవడం విశేషం. భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించే ఆటగాడికి ఇచ్చే ‘దిలీప్ సర్దేశాయ్ అవార్డు’కు అశ్విన్ ఎంపికయ్యాడు. విండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడంతోపాటు 17 వికెట్లు తీసిన అశ్విన్, రెండోసారి ఈ పురస్కారం స్వీకరించనున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా జగ్మోహన్ దాల్మియా అవార్డుకు ఎంపికైంది. గతంలో ఇదే అవార్డును (అప్పుడు చిదంబరం ట్రోఫీ) రెండుసార్లు గెలుచుకున్న మిథాలీకి తొలిసారి దాల్మియా పేరుతో ప్రవేశపెట్టిన పురస్కారం దక్కింది. వీటితో పాటు మరో 13 విభాగాలలో కూడా బోర్డు అవార్డులను ప్రకటించింది. ఈ నెల 8న బెంగళూరులో జరిగే కార్యక్రమంలో వీటిని అందజేస్తారు. -
కోహ్లీ, అశ్విన్ అరుదైన ఘనత!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2015-16 భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన అవార్డులలో పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ, దిలీప్ సర్దేశాయ్ అవార్డును అశ్విన్ దక్కించుకున్నారు. గతంలో ఏ భారత క్రికెటర్‌కు సాధ్యంకాని రీతిలో మూడోసారి పాలీ ఉమ్రిగర్ అవార్డుకు కోహ్లీ ఎంపికయ్యాడు. గతంలో 2011-12, 2014-15 సీజన్లలో ఈ అవార్డు కోహ్లీని వరించింది. ఈ నెల 8న బెంగళూరులో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మరోవైపు అశ్విన్ రికార్డు స్థాయిలో రెండోసారి దిలీప్ సర్దేశాయ్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2011-12 సీజన్లో తొలిసారి అశ్విన్ కు ఈ అవార్డు దక్కింది. ఏ భారత బౌలర్ కూడా రెండో పర్యాయం ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. 2015-16 సీజన్లో అశ్విన్ అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే. సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును రాజేందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్, మహిళల విభాగంలో ఈ అవార్డును శాంతా రంగస్వామి సొంతం చేసుకున్నారు. బీసీసీఐ స్పెషల్ అవార్డు వీవీ కుమార్, రమాకాంత్ దేవాయ్(దివంగత) ఎంపికయ్యారు.