ఉమ్రిగర్‌ అవార్డుకు కోహ్లి ఎంపిక | Kohli to get cricketer of the year award at BCCI annual gala | Sakshi
Sakshi News home page

ఉమ్రిగర్‌ అవార్డుకు కోహ్లి ఎంపిక

Published Thu, Jun 7 2018 3:53 PM | Last Updated on Thu, Jun 7 2018 3:55 PM

Kohli to get cricketer of the year award at BCCI annual gala - Sakshi

ముంబై: గత రెండేళ్లుగా అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది.  కోహ్లితో పాటు.. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన‌ కూడా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. వీరికి జూన్ 12న బెంగళూరు వేదికగా జరగనున్న బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులని అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో అసాధారణ ఆటతీరుతో టీమిండియాకి విజయాల్ని అందించిన కోహ్లి.. 2016-17, 2017-18 సంవత్సరాలకుగానూ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఫలితంగా పాలి ఉమ్రిగర్‌ అవార్డును కోహ్లికి అందజేయనున్నట్లు బీసీసీఐ తెలియజేసింది.

మరొకవైపు ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టుని ఫైనల్‌కి చేర్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ 2016-17కి ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ స్మృతి మంధాన‌ 2017-18 ఏడాదికిగానూ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికైంది.

‘బీసీసీఐ అవార్డులని గెలుచుకున్న క్రీడాకారులకి నా అభినందనలు. గత రెండేళ్లుగా భారత పురుషులు, మహిళల జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. వారి విజయాల్ని చూసి మేము గర్వపడుతున్నాం’ అని బీసీసీఐ పరిపాలక కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement