
విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
బెంగళూరు : తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ముందు అవార్డు అందుకోవడం తనకేంతో ప్రత్యేకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన కోహ్లిని ‘పాలీ ఉమ్రీగర్’ ట్రోఫీలు వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును భారత కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా అందుకోవడం విశేషమైతే.. ఈ కార్యక్రమానికి అనుష్కశర్మ హాజరవ్వడం మరో విశేషం. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘నా భార్య సమక్షంలో అందుకున్న ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. గతేడాది కూడా ఈ అవార్డు అందుకున్నాను. అప్పుడు ఈ అనూభూతి కలగలేదు. ఎందుకంటే అప్పుడు ఆమె లేదు ’ అని తెలిపాడు.
2016-17, 2017-18ల సీజన్లలో కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఈ రెండు సీజన్లకు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచాడు. 2016-17లో 13 టెస్టుల్లో 74 సగటుతో 1332 పరుగులు, 24 వన్డేల్లో 84.22 సగటుతో 1516 పరుగులు చేశాడు. 2017-18 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 టెస్టుల్లో 89.6 సగటుతో 896 పరుగులు చేశాడు. ఇక కోహ్లితో పాటు అన్షుమన్ గైక్వాడ్, సుధా షాలకు ‘సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డులు దక్కాయి.
రెండు సీజన్లలో వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లందరూ అవార్డులు అందుకున్నారు. భారత ‘ఎ’ జట్టుతో పాటు ఇంగ్లండ్ వెళ్లిన కృనాల్ పాండ్యా మినహా మిగతా వారంతా స్వయంగా అవార్డులు స్వీకరించారు. అండర్–16 విభాగంలో అత్యుత్తమ ఆటతీరు చూపించిన తెలుగు కుర్రాళ్లు ఠాకూర్ తిలక్ వర్మ (హైదరాబాద్ జట్టు), నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధ్ర జట్టు)లకు దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి ‘జగ్మోహన్ దాల్మియా’ అవార్డు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment