
లండన్ : టీమిండియాతో పాటు భారత హైకమిషన్ కార్యాలయ సిబ్బంది దిగిన ఫొటోలో కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎందుకున్నారన్న విమర్శలకు సమాధానం దొరికింది. అసలే తొలి టెస్టు ఓటమిపాలు కావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై క్రికెట్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం.. క్రికెటర్లతో పాటు వారి కుటుంబాన్ని, బంధువులను ఆహ్వానించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అందువల్లే టీమిండియా దిగిన ఫొటోలో నటి అనుష్క శర్మ ఉన్నారని వివరణ ఇచ్చారు.
రిసెప్షన్ ఈవెంట్‌లో భాగంగా హై కమిషనర్, ఆయన భార్య ఆహ్వానం మేరకే అనుష్క శర్మ వచ్చారని స్పష్టమైంది. ‘’భారత క్రికెటర్లు ఎలాంటి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు. క్రికెటర్లు ఎవరితోనైనా ఫొటోలు దిగొచ్చు. ఈ విషయంలో బీసీసీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కెప్టెన్ కోహ్లి పక్కన నిల్చోవాల్సిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే తన ఇష్టపూర్వకంగానే వెనుక వరుసలో నిల్చుని ఫొటో దిగాడు. ఈ విషయంలో అనుష్క, కోహ్లిల తప్పేమీ లేదు. అనవసర విషయాలపై రాద్ధాంతం తగదని’ బీసీసీఐ ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు. (ఆటకోసమా? హనీమూన్ కోసమా?)
కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు నేడు (గురువారం) ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శన చేసినా జట్టు బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కొరవడి.. తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment