కోహ్లికి పాలీ ఉమ్రీగర్ పురస్కారం
అశ్విన్‌కు దిలీప్ సర్దేశాయ్ అవార్డు
బీసీసీఐ అవార్డుల ప్రకటన
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రీగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడికి ఈ అవార్డును అందజేస్తారు. 2015–16 సీజన్‌కు గాను బీసీసీఐ వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 2011–12, 2014–15లో కూడా ఉమ్రీగర్ అవార్డును గెలుచుకున్న కోహ్లి, మూడుసార్లు దీనికి ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా నిలవడం విశేషం. భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించే ఆటగాడికి ఇచ్చే ‘దిలీప్ సర్దేశాయ్ అవార్డు’కు అశ్విన్ ఎంపికయ్యాడు.
విండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడంతోపాటు 17 వికెట్లు తీసిన అశ్విన్, రెండోసారి ఈ పురస్కారం స్వీకరించనున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా జగ్మోహన్ దాల్మియా అవార్డుకు ఎంపికైంది. గతంలో ఇదే అవార్డును (అప్పుడు చిదంబరం ట్రోఫీ) రెండుసార్లు గెలుచుకున్న మిథాలీకి తొలిసారి దాల్మియా పేరుతో ప్రవేశపెట్టిన పురస్కారం దక్కింది. వీటితో పాటు మరో 13 విభాగాలలో కూడా బోర్డు అవార్డులను ప్రకటించింది. ఈ నెల 8న బెంగళూరులో జరిగే కార్యక్రమంలో వీటిని అందజేస్తారు.