కోహ్లీ, అశ్విన్ అరుదైన ఘనత!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2015-16 భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన అవార్డులలో పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ, దిలీప్ సర్దేశాయ్ అవార్డును అశ్విన్ దక్కించుకున్నారు. గతంలో ఏ భారత క్రికెటర్‌కు సాధ్యంకాని రీతిలో మూడోసారి పాలీ ఉమ్రిగర్ అవార్డుకు కోహ్లీ ఎంపికయ్యాడు. గతంలో 2011-12, 2014-15 సీజన్లలో ఈ అవార్డు కోహ్లీని వరించింది. ఈ నెల 8న బెంగళూరులో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
మరోవైపు అశ్విన్ రికార్డు స్థాయిలో రెండోసారి దిలీప్ సర్దేశాయ్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2011-12 సీజన్లో తొలిసారి అశ్విన్ కు ఈ అవార్డు దక్కింది. ఏ భారత బౌలర్ కూడా రెండో పర్యాయం ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. 2015-16 సీజన్లో అశ్విన్ అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే. సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును రాజేందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్, మహిళల విభాగంలో ఈ అవార్డును శాంతా రంగస్వామి సొంతం చేసుకున్నారు. బీసీసీఐ స్పెషల్ అవార్డు వీవీ కుమార్, రమాకాంత్ దేవాయ్(దివంగత) ఎంపికయ్యారు.