
Ashwin Slams Fake Media Reports In Virat Kohli Issue: మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల(రహానే, పుజారా)తో కలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని, కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి పరోక్ష కారకుడని గత కొద్ది రోజులుగా మీడియాలో వివిధ కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తొలిసారి స్పందించాడు. కోహ్లి ఎపిసోడ్‌లో తన ప్రమేయం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చాడు. ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇదివరకే స్పష్టతనిచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అసత్య కథనాలు ప్రసారం చేసి టీమిండియా అభిమానులను తప్పుదోవ పట్టించరాదని ఓ ప్రముఖ వార్తా సంస్థపై విరుచుకుపడ్డాడు.
ఫేక్ న్యూస్ అనే హ్యాండిల్ కోసం వెతుకుతున్నానని, అది పేరు మార్చుకుని ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీగా మారిందని, అలాంటి వార్తా సంస్థల్లో ప్రసారమయ్యే నిరాధారమైన కథనాలను బేస్ చేసుకుని మరిన్ని వార్త సంస్థలు కట్టుకథలు అల్లుతున్నాయని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. కాగా, ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌లో కోహ్లి అసమర్ధత వల్లే టీమిండియా ఓడిపోయిందని.. ఈ విషయాన్ని అశ్విన్ సహా రహానే, పుజారాలు బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారని ఓ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అశ్విన్ తనదైన స్టైల్‌ల్లో విరుచుకుపడ్డాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశాడు. సదరు న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు.
చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి