జలాలపై జన నివాసాలు
ఎవరు ఔనన్నా, ఇంకెవరు కాదన్నా.... ఈ భూమ్మీద మనిషికి నూకలు చెల్లే కాలం దగ్గరకొచ్చేసింది. పర్యావరణం అతలాకుతలమవుతోంది. అకాల వరదలు నగరాలను ముంచేస్తున్నాయి. ఇంకొన్నేళ్లు పోతే... నీటి యుద్ధాలు తప్పవేమో అనేట్టుగా ఉంది పరిస్థితి. సపోజ్.. ఫర్ సపోజ్.. రేపోమాపో... ‘నేల‘పై బతికే పరిస్థితి లేకపోతే మీరేం చేస్తారు? మీరింకా అంతదూరం ఆలోచించి ఉండరుగానీ... సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఎంచక్కా సముద్రాలపై నగరాలు కట్టేస్తే పోలా అంటోంది. భూమ్మీద 70 శాతం ప్రాంతాన్ని ఆవరించిన సముద్రాలపై.. తేలియాడే నగరాలను కట్టాలన్న ఈ కంపెనీ ఆలోచనకు ఈ మధ్యే ఫ్రెంచ్ పాలినీసియా దేశ ప్రభుత్వం ఓకే చెప్పేసింది.
న్యూజిల్యాండ్, అమెరికాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ చిన్ని దేశం. వందకుపైగా ద్వీపాలతో 2.5 లక్షల జనాభా మాత్రమే ఉండే ఫ్రెంచ్ పాలినీసియా సమీపంలో పైలెట్ పద్ధతిన ఓ తేలియాడే నగరాన్ని కట్టాలన్నది సీస్టీడింగ్ ఆలోచన. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నది అలాంటి డిజైనే. అక్కడికక్కడే పంటలు పండించుకోవడానికి, విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడానికి ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నాచుమొక్కల పెంపకం ద్వారా అటు చేపల్ని ఇటు ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది ఈ నగరం.
చిన్న చిన్న ద్వీపాల మధ్య ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు విపరీత వాతావరణంతో ఇబ్బందుల్లేకుండా చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి రున్డాల్ఫ్ హెన్కిన్. పర్యావరణానికి ఏమాత్రం హాని జరగని రీతిలో వ్యర్థాల రీసైక్లింగ్ కూడా జరుగుతుందని, ఏ దేశంవారైనా ఈ తేలియాడే నగరంలో నివసించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్