పరువు తీశావు.. సన్నీ లియోన్ వందకోట్లు కట్టు!
ముంబై: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్పై మోడల్, బిగ్ బాస్ మాజీ పోటీదారు పూజా మిస్రా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసి.. తనకు ఆర్థికంగా నష్టం కలిగించినందుకు రూ. 100 కోట్లు తనకు కట్టాలని ఆమెను డిమాండ్ చేసింది. జస్టిస్ నరేశ్ పాటిల్ నేతృత్వంలోని బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది. ధర్మాసనం వాదనలు వినే సమయంలో పిటిషనర్ కోర్టుకు హాజరుకాలేదు.
బిగ్ బాస్-5 టీవీ షోలో మొదట తానే పాపులర్ పోటీదారునని, షో ప్రారంభమైన చాలారోజులకు సన్నీ లియోన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించిందని పూజా మిస్రా తన పిటిషన్లో పేర్కొంది. అయితే, తన గురించి కొన్ని మీడియా సంస్థల్లో సన్నీ పరువు నష్టం కలిగించే ఇంటర్వ్యూలు ఇచ్చిందని, తనపై ఈర్ష్య, దుర్భుద్ధితోనే ఆమె ఇలా చేసిందని ఆరోపించింది. ఓ దినపత్రికలో రాసిన ఆర్టికల్లో తనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసిందని, దీనివల్ల ప్రజల దృష్టిలో తన గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లిందని పేర్కొంది. ఈ పరిణామాల కారణంగా తన ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంకు పొదుపులను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని, దీనివల్ల రూ. 70 లక్షల నష్టం తనకు వాటిల్లిందని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. సన్నీ లియోన్పై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 120 బీ (కుట్ర) అభియోగాలతో చర్యలు చేపట్టాలని ఆమె కోర్టును కోరింది.