బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు.
వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం
బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు.
నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.