గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం భారత్‌కు థర్ఢ్‌వేవ్ ముప్పు తప్పేలా లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంబంధ వ్యవస్థల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కూడా ఒమిక్రాన్ వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చదవండి: (Omicron Variant: సిరంజీలకు కొరత..!)
ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పని చేస్తాయా? అనే ప్రశ్నకు డాక్టర్ ఖేత్రపాల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌లో అనేక పరివర్తనాల దృష్ట్యా, ప్రస్తుత వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతకు అడ్డుకట్టవేస్తూ.. మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని మాత్రమే భావించడం సహేతుకమని అన్నారు. టీకాలు వేసిన వారిలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున.. వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్కు గురికాకుండా అడ్డుకుంటాయే తప్ప అవి పూర్తిగా వ్యాధిని నిరోధించలేదని తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. బూస్టర్ డోస్‌ల ఆవశ్యకతపై చర్చిస్తూ.. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులు ప్రమాదంలో ఉండే అవకాశం ఉందని, వారికి టీకా అదనపు డోసును అందించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పేర్కొన్నారు.
చదవండి: (Omicron: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..)
కాగా.. ఆదివారం నాడు గంట వ్యవధిలోనే ఏపీ, చత్తీస్‌గఢ్, కర్ణాటకలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36కి పెరిగింది. దేశంలో అత్యధికంగా 17 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, తొమ్మిది కేసులతో రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది. గుజరాత్, కర్ణాటకలో ఇప్పటివరకు మూడు కేసులు నిర్ధారణ జరిగింది. ఢిల్లీలో రెండు, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.