చోటా ఏటీఎంలు భలే!
వంగర: వంగర మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) శాఖ ద్వారా రెండు మినీ ఏటీఎంలను గురువారం ప్రారంభించారు. వంగరలో తంగుడు వెంకటరమణ, ఎం.సీతారాంపురంలో పట్నాన గోపాలరావు వీటిని నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఏ బ్యాంకు ఖాతాదారుడైనా ఏటీఎం ఉంటే రోజూ రూ. వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు డ్రా చేసుకునే అవకాశముంది.
ఇదో రకమైన మొబైల్ బ్యాంకింగ్
విశాఖపట్నానికి చెందిన పొర్లాస్ ఈ-కామర్స్ సంస్థ మినీ ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తోంది. నిర్వాహకులు రూ.3 వేలు చెల్లిస్తే ఒక స్వైపింగ్ మెషీన్‌ను మంజూరు చేస్తారు. దీన్ని నిర్వాహకుడు వినియోగించే సెల్‌ఫోన్‌కు అనుసంధానిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సెల్ఫోన్లో పొందుపరిచి స్వైపింగ్ మిషన్, సెల్‌ఫోన్ ఆధారంగా నగదు బదిలీ చేస్తారు. ఖాతాదారుడు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుడు చెల్లిస్తే.. తర్వాతి రోజు ఎస్బీఐ చెల్లించే కమీషన్‌తోపాటు విత్‌డ్రా చేసిన డబ్బును నిర్వాహకుని ఖాతాలోకి మళ్లిస్తారు. ఇలాంటి సదుపాయం కల్పించడంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.