FIPIC summit: భారత్ విశ్వసనీయ భాగస్వామి
పోర్ట్ మోరిస్‌బై: ఆపదలోఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నవారు క్లిష్ట సమయంలో ఆదుకోకపోవడం నిజంగా దారుణమని అన్నారు. తద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యవహార శైలిని తప్పుపట్టారు. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరిస్‌బైలో సోమవారం ఫోరమ్ ఫర్ ఇండియా–పసిఫిక్ ఐలాండ్స్ కో–ఆపరేషన్(ఎఫ్ఐపీఐసీ) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.
14 పసిఫిక్ ద్వీప దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా నిలుస్తోందని మోదీ గుర్తుచేశారు. భారత్‌ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చని ఆయా దేశాలకు సూచించారు. తమ శక్తి సామర్థ్యాలను, అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి మార్గంలోనూ తోడుగా ఉంటామని మోదీ వివరించారు. తమ దృష్టిలో ఈ దేశాలు చిన్న దేశాలు ఎంతమాత్రం కావని, భారీ సముద్ర దేశాలుగా వాటిని పరిగణిస్తున్నామని మోదీ చెప్పారు.
మూడు దేశాల అధినేతలతో భేటీ
మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిష్ హిప్కిన్స్, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ అధ్యక్షుడు సురాంగెల్ ఎస్.విప్స్ జూనియర్, పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, క్రీడలు, సాంకేతికత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. హిప్కిన్స్తో భేటీ అద్భుతంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. పాలౌ ప్రజలు వాడే ఎబాకిల్ పరికరాన్ని మోదీకి సురాంగెల్ బహూకరించారు.
ఆస్ట్రేలియాతో సుదృఢ బంధం
న్యూఢిల్లీ: ‘‘నేనంత త్వరగా తృప్తిపడే రకం కాదు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కూడా అంతే. ఇద్దరమూ కలిసి ఆస్ట్రేలియా, భారత బంధాలను మరింత దృఢతరం చేసి తీరతాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సిడ్నీలో ‘ద ఆస్ట్రేలియన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం, సముద్ర తీర భద్రత, పైరసీ దాకా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందంటూ ఆందోళన వెలిబుచ్చారు.
విందులో భారతీయ రుచులు
ఎఫ్ఐపీఐసీ శిఖరాగ్రం సందర్భంగా ఫసిíఫిక్ ద్వీప దేశాల అధినేతలకు సోమవారం మధ్యాహ్నం మోదీ ఇచ్చిన విందులో భారతీయ వంటకాలు, ముఖ్యంగా తృణధాన్యాల వెరైటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులు తృణధాన్యాల విశిష్టితను అడిగి తెలుసుకున్నారు. ఖాండ్వీ, వెజిటెబుల్ సూప్, మలై కోఫ్తా, రాజస్తానీ రాగి గట్టా కర్రీ, దాల్ పంచ్మెల్, మిలెట్ బిర్యానీ, నాన్ ఫుల్కా, మసాలా చాస్, పాన్ కుల్ఫీ, మాల్పువా, మసాలా టీ, గ్రీన్ టీ, మింట్ టీ, పీఎన్జీ కాఫీ తదితరాలను రుచిచూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.
మోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యున్నత గౌరవం లభించింది. పసిఫిక్ సముద్ర ద్వీప దేశాలైన పపువా న్యూ గినియా, ఫిజి తమ అత్యున్నత పురస్కారాలను ఆయనకు ప్రదానం చేశాయి. ఆయా దేశాలు మరో దేశ ప్రధానిని ఇలాంటి పురస్కారాలతో గౌరవించడం అరుదైన సంఘటన కావడం విశేషం. సొమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ డొడాయి ప్రధాని మోదీకి ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు(జీసీఎల్)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
భారత్‌లో భారతరత్న తరహాలో పపువా న్యూగినియాలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందించినట్లు పపువా న్యూ గినియా ప్రభుత్వం వెల్లడించింది. జీసీఎల్ పురస్కారం పొందిన వారిని ‘చీఫ్’ అనే టైటిల్‌తో సంబోధిస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ఈ అవార్డు లభించింది.
ఫిజి ప్రధానమంత్రి సితివేణి రాబుకా భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని ప్రదానం చేశారు. మోదీ గ్లోబల్ లీడర్‌షిప్‌నకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలియజేసింది. ఇది భారత్‌కు లభించిన అరుదైన గౌరవమని వివరించింది. ఈ గౌరవాన్ని మోదీ భారతదేశ ప్రజలకు, ఫిజి–ఇండియన్ సమాజానికి అంకితం చేశారని పేర్కొంది.
దేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తింపు
‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు’, ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ గౌరవాలు తనకు దక్కడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూగినియా, ఫిజి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాలు భారత్‌కు, భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, మాల్దీవ్స్, బహ్రెయిన్ తదితర దేశాలు గతంలో తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి.