కోరుట్లలో స్వైన్‌ప్లూ కలకలం
గర్భిణికి పాజిటివ్ లక్షణాలు.. పరిస్థితి విషమం
కోరుట్ల : కోరుట్ల పట్టణంలో స్వైన్‌ప్లూ కేసు కలకలం రేపింది. నెలక్రితం పట్టణంలోని రథాలపంపు వీధికి చెందిన గర్భిణి దావనపల్లి కల్యాణి(26) జ్వరం, దమ్ముతో స్థానిక ఆసుపత్రిలో చేరింది. మరికొన్ని రోజుల్లో డెలివరీకి ఉండగా విపరీతమైన జ్వరం, దమ్ముతో ఇబ్బంది పడుతుండగా మరో వైద్యుడికి రెఫర్ చేశారు. అక్కడ పరిశీలించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నాలుగురోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు డెలీవరి చేయగా బాబు పుట్టాడు.
కల్యాణి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల్లో స్వైన్‌ప్లూ పాజిటివ్‌గా తేల్చారు. ప్రస్తుతం వైరస్ తీవ్రస్థాయిలో ఉండడంతో కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
నామమాత్రంగా స్పందించిన వైద్యాధికారులు
కల్యాణికి స్వైన్‌ప్లూ వైరస్ సోకినట్లు హైదరాబాద్ యశోద వైద్యులు నిర్ధారించిన అనంతరం కోరుట్ల సివిల్ ఆస్పత్రి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కల్యాణికి పుట్టిన బాబుకు స్వైన్‌ప్లూ సమస్య ఉందేమోనన్న అనుమానంతో ఆమె తల్లిగారి స్వగ్రామం వెంకటాపూర్‌కు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి వచ్చినట్లు సమాచారం. బాబుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేయకుండా కోరుట్లలోనూ కల్యాణి నివాసముండే పరిసరాలను తూతూమంత్రంగా పరిశీలించినట్లు తెలిసింది. స్వైన్‌ప్లూ నివారణకు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వహించారు.