24 ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టుపై ముష్కరులు విరుచుకుపడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. మొత్తం నాలుగు నగరాల్లో 24 ఎయిర్ పోర్టుల అథారిటీలకు ఈ వివరాలను పంపినట్లు ఐబీ తెలిపింది. దీంతో ఎయిర్ పోర్టుల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పింది.
పౌర విమానయాన శాఖ రాష్ట్రాల పోలీసు శాఖలకు, సీఐఎస్ఎఫ్, పారా మిలటరీ బలగాలకు జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్ధాన్, గుజరాత్, ఢిల్లీల ఎయిర్ పోర్టులలో భద్రతను పెంచాలని లేఖలు రాసింది. ఉగ్రదాడి హెచ్చరికలు అందడంతో నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు హై అలర్ట్ ను ప్రకటించాయి. పండగ సీజన్ కావడం వల్ల భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడం మామూలే.
గత వారం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదులు యత్నిస్తున్నారు. దాదాపు 100మందికి పైగా ముష్కరులు నియంత్రణ రేఖకు ఆవల భారత్ లోకి చొచ్చుకువచ్చేందుకు చూస్తున్నారని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.