బాబుకు పదే పదే విరేచనాలు...!
మా బాబుకు పదమూడు నెలలు. రెండు నెలల క్రితం వాడికి విపరీతంగా విరేచనాలు అయ్యాయి. దాంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మాటిమాటికీ తిరగబెడుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గడం, వెంటనే మళ్లీ పెరగడం జరుగుతోంది. ఇది మినహా వాడికి ఇతరత్రా ఏ సమస్యలూ లేవు. అంటే... ఆడుకోవడం, ఆహారం తీసుకోవడం, పెరుగుదల ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి. మా వాడికి ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి.
- శైలజ, చెన్నై
మీరు వివరించిన లక్షణాలను బట్టి, మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. అంటే... ఏ సందర్భంలోనైనా విరేచనాలు రెండు వారాల కంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు.
సాధారణంగా మన దేశంలోని పరిసరాలను పరిగణనలోకి తీసుకుంటే దీర్ఘకాలిక డయేరియాకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ను కారణంగా చెప్పవచ్చు. అదే ఆర్థికంగా బలమైన దేశాలను తీసుకంటే అక్కడ వివిధ వయసుల వారిలో వచ్చే క్రానిక్ డయేరియాలను బట్టి అనేక కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది.
ఇన్ఫెక్షన్లకు గల కారణాలను పరిశీలిస్తే వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ, ఎంజైమ్‌లలో మార్పులు, ఆహారం అరుగుదలలో మార్పులు... అంటే ఇందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా కారణం కావచ్చు. వీటితోపాటు ఇమ్యునలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్ట్రక్చరల్ లోపాలు, మొటిలిటీలో మార్పులు కారణం కావచ్చు. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యునలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టైనల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యునలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకాశం ఉంటుంది.
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాలకు అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకున్నట్లుగా విశ్లేషించవచ్చు. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ వంటి వాటికి అతడి కడుపు సెన్సిటివ్‌గా మారడం లేదా ఇంకోరకం బ్యాక్టీరియా వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ రావడం జరిగి ఉండవచ్చు. అలాగే ఈ వయసు పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావచ్చు.
దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్-ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఇక ఎలాంటి సందర్భాల్లోనైనా డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను అన్వేషించి, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
మీ బాబు విషయంలో పెరుగుదల, ఆడుకోవడం అంతా నార్మల్‌గా ఉందంటున్నారు కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్