post office accounts
-
పోస్టాఫీసులకు మహిళలు పరుగులు..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది?
మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు మీరు రికరింగ్ డిపాజిట్ సేవలను పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో.. అదే వడ్డీ రేటు ఆర్డీ ఖాతాలపై కూడా వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పోస్టాఫీస్‌లలో కూడా ఆర్డీ ఖాతాలను తెరవచ్చు. ఆర్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటాడు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీతో సహ కలిపి వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు. పోస్టాఫీస్: జనవరి 1, 2021 నుంచి పోస్టాఫీస్ లో ప్రతి ఆర్ధిక సంవత్సరానికి 5.8 శాతం వడ్డీరేటును పొదుపు చేసిన సొమ్ముపై అందిస్తుంది. దీనికి 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ తెరవడానికి కనీసం నెలకు రూ.10 కట్టినా సరిపోతుంది. మీ డబ్బుకు రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. ఎస్బీఐ: ఎస్బీఐ ఆర్డీ వడ్డీ రేటు సాధారణ ఖాతాదారులకు 5 నుంచి 5.4శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు కలుపుతారు. ఈ వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుంచి వర్తిస్తాయి. ఎస్బీఐ ఆర్డీ మెచ్యూరిటీ పీరియడ్ 1 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెలకు కనీసం రూ.100 నుంచి పొదుపు చేయవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఆర్డీలకు 5.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. మొదటి రెండు సంవత్సరాలకు - 4.9 శాతం వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు - 5.1%, 3 - 5 సంవత్సరాల వరకు - 5.3%, 5 - 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. చదవండి: ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్
ముంబై, సాక్షి: సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్డవున్లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్ శాఖ పలు సర్వీసులు అందించింది. ప్రధానంగా మెడికల్ తదితర కీలకమైన పార్సిల్ డెలివరీలలో ముందు నిలిచింది. లాక్‌డవున్ సమయంలో 10 లక్షల మెడికల్ ఆర్టికల్స్‌ను డెలివరీ చేసింది. వీటిలో మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఔషధాలున్నాయి. ఈ బాటలో పార్సిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2020 డిసెంబర్‌కల్లా వార్షికంగా 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచుకుంది. కాగా.. ఈ ఏడాది(20201) ఏప్రిల్‌కల్లా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్.. దేశంలోని ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు వీలు కలగవచ్చని పీఎస్‌యూ దిగ్గజం ఇండియా పోస్ట్ భావిస్తోంది. ఇందుకు వీలుగా ఇటీవల పలు సర్వీసులను డిజిటైజేషన్ బాట పట్టించిన పోస్టల్ శాఖ 2021లో అన్ని సర్వీసులనూ ఆన్లైన్ చేయాలని భావిస్తోంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 50 కోట్ల ఖాతాలు పోస్ట్ ఆఫీస్‌కు కీలకమైన బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు పోస్టల్ శాఖ సెక్రటరీ ప్రదీప్త కుమార్ తాజాగా పేర్కొన్నారు. 23,483 పోస్టాఫీసులు ఇప్పటికే ఈ నెట్వర్క్ పరిధిలోకి చేరినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులున్నాయి. వీటి ద్వారా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో 50 కోట్లమందికి ఖాతాలున్నాయి. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల నిర్వహణకు 1.36 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇంటివద్దనే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. (4 నెలల గరిష్టానికి రూపాయి) పలు పథకాలు పోస్టాఫీస్ పొదుపు పథకాలలో భాగంగా సేవింగ్స్ ఖాతా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి(ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్(ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ తదితరాలను అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకాల కింద రూ. 10,81,293 కోట్ల ఔట్‌స్టాండింగ్ బ్యాలన్స్‌ను కలిగి ఉంది. సీబీఎస్ ద్వారా 24 గంటలూ ఏటీఎం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తోంది. పీవోఎస్‌బీ పథకాలన్నిటినీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు అనుసంధానించింది. దీంతో మొబైల్ యాప్ డాక్‌పే ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించింది. మొబైల్ యాప్ పోస్ట్‌మ్యాన్ మొబైల్ యాప్‌లో 1.47 పీవోఎస్‌లను భాగం చేసింది. తద్వారా 14 కోట్ల స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సిల్ ఆర్టికల్స్ స్టేటస్‌ను వాస్తవిక సమాయానుగుణంగా పరిశీలించేందుకు వీలు కల్పించింది. డాక్ఘర్ నిర్యత్ కేంద్ర పేరుతో ఈకామర్స్కూ మద్దతు పలుకుతోంది. తద్వారా ఎంఎస్ఎంఈ ప్రొడక్టుల ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా పోస్టల్ జీవిత బీమా, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు తదితరాలలో గ్రామీణ ప్రాంతాలనూ డిజిటలైజేషన్లో భాగం చేస్తోంది. -
ఆసరా అనుసంధానం అరకొర!
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా.. పింఛను సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల అనుసంధాన ప్రక్రియ నాలుగు నెలలుగా నత్తనడకన సాగడంతో అది నెరవేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,20,156 మంది పెన్షనర్లలో కేవలం 16,18,517 (సగం మంది) ఖాతాలకే పింఛన్ల సొమ్ము జమవుతోంది. అలాగే భృతిని పొందుతున్న 3.20 లక్షల బీడీ కార్మికుల్లో ఖాతాల ద్వారా పింఛను పొందుతోంది 1.75 లక్షల మందికే. మిగిలిన బీడీ కార్మికులకు, పెన్షనర్లకు పింఛను సొమ్మును సిబ్బంది ద్వారా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా, లబ్ధిదారులకు సంపూర్ణంగా అందడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కొందరు దళారులు వృద్ధులు, వికలాంగుల పింఛను సొమ్ము స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ససేమిరా అంటున్న బ్యాంకర్లు పింఛను సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులకు ఖాతాలు తెరిచేందుకు కొన్ని బ్యాంకులు విముఖత వ్యక్తం చేస్తున్నాయని సెర్ప్ అధికారులు వాపోతున్నారు. వృద్ధాప్య పింఛను పొందుతున ్న వారంతా 65 ఏళ్లు పైబడిన వారు కావడం, వికలాంగుల్లో కొందరి వేలిముద్రలు సరిగా ఉండకపోతుండడాన్ని బ్యాంకులు కారణాలుగా చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకుకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడం, కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు బ్యాంకులు అందుబాటులో లేకపోవడం కూడా ఖాతాల అనుసంధానానికి ఆటంకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛను పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ప్రయత్నించినా, పోస్టాఫీసుల నుంచి సహకారం లభించడం లేదు. కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు పోస్టాఫీసు అధికారులు మొగ్గు చూపడం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండలలో పెన్షనర్ల బ్యాంకు ఖాతాలను నేటికీ అనుసంధానం చేయలేదు. పింఛనర్లు బ్యాంకు ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లను ఒప్పించాలని జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.