Posts sanitation workers
-
వైద్యశాఖలో 2,118 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. -
ఇక్కడ పోస్టులు అమ్మబడును!
► పెద్దాస్పత్రిలోపారిశుద్ధ్య పోస్టుల పందేరం ►ఒక్కో పోస్టుకు రూ.30 వేలకు బేరం ► ఆస్పత్రిలో కీలక వ్యక్తుల పాత్ర కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల పందేరానికి తెరలేచింది. ఒక్కోపోస్టుకు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆస్పత్రిలోని కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నెల నుంచి ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులను రాష్ట్ర ప్రభుత్వం ఏ1 సంస్థకు అప్పగించింది. గతంలో ఈ పనులను ఏజిల్ సంస్థ నిర్వహించేది. అప్పట్లో ఈ సంస్థకు నిర్వహణ కింద నెలకు రూ.35 లక్షలను ఇచ్చేవారు. ప్రస్తుత కార్మికుల సంఖ్యను 180 నుంచి 300లకు పెంచడం, వేతనాలు కూడా పెరగడంతో నిర్వహణ మొత్తాన్ని రూ.58 లక్షలకు పెంచారు. అయితే ఆశావహుల కన్ను కార్మికుల పోస్టులపై పడింది. వారం రోజుల నుంచి ఈ పోస్టుల విషయమై పలువురు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. తెలిసిన వారిని, పైరవీలు చేసే వారిని కలిసి పోస్టు ఇప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. ఆశావహుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పైరవీకారులు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టినేతల ఒత్తిళ్లు ఒకేసారి ఆస్పత్రిలో 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద ఏ1 సంస్థ భర్తీ చేయనుందని ప్రచారం జరగడంతో అధికార పార్టీ నాయకుల కన్ను వీటిపై పడింది. చోటామోటా నాయకులు రంగప్రవేశం చేసి ఆసుపత్రి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. పోస్టులను తమవారికే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నాయకులు ఇదే అదనుగా ఆశావహుల నుంచి రూ.15 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పోస్టులను భర్తీ చేసే అధికారం తమకు లేదని, అది పూర్తిగా ఏ1 సంస్థ చూసుకుంటుందని అధికారులు తప్పించుకుంటున్నట్లు సమాచారం. చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. తాము చెప్పిన వారికే పోస్టులు ఇవ్వకపోతే భవిష్యత్లో ఇబ్బందులు పడతారని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.30 వేల చొప్పున ఇవ్వాలని ఆశావహులను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పదేళ్ల క్రితం ఈ పోస్టులను రూ.10 వేల చొప్పున కొందరు అధికారులు అమ్ముకున్నారని, రెండేళ్ల క్రితం కూడా రూ.20 వేల వరకు అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.30 వేలకు తగ్గకూడదని కీలక వ్యక్తులు నిర్ణయించినట్లు సమాచారం. ఏ1 సంస్థతో ఒప్పందం కాలేదు ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఏ1 సంస్థతో ఇప్పటి వరకు ఎలాంటి ఎంఓయూ జరగలేదు. ఆ తర్వాత కూడా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలను ఏ1 సంస్థ మాత్రమే చేపడుతుంది. ఆసుపత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దు. - డాక్టర్ వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్