potan kumar poddar naik
-
ఐఎస్ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా
* పటన్ అరెస్టుతో వెలుగుచూస్తున్న వాస్తవాలు * మిలటరీకి చెందిన ఫొటోలు, డాక్యుమెంట్లు అందజేత * మహిళా ఉగ్రవాది నుంచి పటన్ అకౌంట్‌కు రూ. 74 వేలు * ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలు పాక్ ఉగ్రవాదులకు చేరవేసిన సైనిక అధికారి పటన్‌కుమార్ అరెస్టుతో దిమ్మతిరిగే విషయాలు గురువారం వెలుగు చూశాయి. పటన్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ముద్దాయి తరఫున న్యాయవాది లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేజిస్ట్రేట్ వెల్లడించారు. ముద్దాయి వాదన వినకుండా కస్టడీకి ఇవ్వలేమని, అతనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీంతో పోలీసులు చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌కు కస్టడీ పిటిషన్ విషయంపై వివరించారు. ఇలావుండగా పటన్ నుంచి 4 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూటూత్, 3 సెల్ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌డిస్క్‌ను డీకోడ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు శ్రమిస్తున్నారు. డీకోడ్ అయితే పటన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు వెల్లడించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. పటన్కుమార్ను సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందజేసినట్లు తెలిసింది. పటన్‌కుమార్ వ్యవహార శైలిపై బీహార్, పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పని చేసిన విభాగాల్లో అతని ప్రవర్తన, తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. అనుష్క అగర్వాల్ పేరిట చాటింగ్ చేసిన ఆ యువతి అసలుపేరు ఏమిటనేది తేలాల్సి ఉంది. పంపిన రహస్యాలు ఇవే ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాల వివరాలతో పాటు కీలక విభాగాల్లో ఉన్న 40 మంది ఆర్మీ అధికారుల వివరాలను పటన్ పంపినట్లు తెలుస్తోంది. ఆర్మీ డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా పంపించాడు. దేశంలో ఉన్న 12 ఆర్మీ యూనిట్ల బ్రిగేడ్ల పేర్లు, ఆ ప్రదేశాల వివరాలు, పశ్చిమ సరిహద్దులోని ఆర్మీ సమాచారాన్ని ఫోన్లో అనుష్కకు చెప్పాడు. సైన్యం కదలికలు, ఎత్తుగడలు, కీలక స్థావరాలను ఆమెకు వెల్లడించాడు. జీ మెయిల్ ఐడీ ‘ప్రియాన్షూ1995’తో ఈ మెయిల్ సృష్టించిన పటన్ దాని ఐడీని అనుష్కకు చేరవేశాడు. పలు వివరాలను ఈ మెయిల్‌కు పంపగానే ఆమె వాటిని డౌన్లోడ్ చేసుకుంది. కాగా పాక్ మహిళా ఉగ్రవాదికి పలు రహస్యాల చేరవేతపై ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారికి చెందిన కంప్యూటర్ను పటన్ ఉపయోగించాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆ అధికారి కంప్యూటర్ కోడ్ పటన్‌కు తెలియడంతో ఆ వివరాలను అనుష్కకు పంపినట్లు తెలిసింది. రహస్యాలకు పారితోషికం ఇక్కడి సమాచారాలు అనుష్కకు అందించినందుకు గాను మొదటిసారిగా 2013 మేలో బీహార్‌లోని ఎస్బీఐలో ఉన్న పటన్ బ్యాంక్ అకౌంట్లోకి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ఎస్బీఐ (మంగల్వాడి బ్రాంచి) నుంచి రూ.9,000ను అనుష్క పంపించింది. ఇలా ఏడాది కాలంలో రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.20 వేల చొప్పున రూ.74 వేలు వేసింది. తాను అడిగిన రహస్యాలు పంపితే హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా కలుస్తానని, లండన్‌కు కూడా పంపిస్తానని చెప్పింది. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసాడని పటన్‌ను నమ్మించింది. పటన్ చిక్కాడిలా పటన్ సెల్‌కు ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది చేసిన సెల్ నంబర్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఆమె వాడిన సెల్‌ఫోన్ ప్రదేశం పాక్ సరిహద్దుల్లోదని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ నుంచే ఆర్మీ రహస్యాలను రాబట్టిందని విచారణలో తేలింది. పాక్ సరిహద్దుల్లో సెల్ఫోన్లను ఐబీ అధికారులు ట్రాప్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయని గ్రహించారు. ఐబీ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో పటన్ గుట్టు రట్టయ్యింది. 15 రోజులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రమించి పటన్‌ను పట్టుకోగలిగారు. పటన్ నేపథ్యమిదీ బీహార్ రాష్ట్రానికి చెందిన పటన్‌కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇతని కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థిరపడింది. 1996లో క్లర్క్‌గా ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నిర్వహించాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. 2006 నుంచి 2012 వరకు జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని ఆర్మీ సెంటర్లో పనిచేశాడు. 2012లో సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యాడు. అతని భార్య, పిల్లలు మాత్రం బీహార్లోనే ఉంటున్నారు. అనుష్క ఎఫ్బీలో సైనికాధికారుల ఫొటోలు కాగా అనుష్క ఫేస్బుక్లో 20 మంది సైనికాదుకారుల పేర్లు, ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. వారి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్మీ పీఆర్ఓ వివరణ పటన్ ఈఎంఈలో పనిచేయడం లేదని అతను ఆర్మీ ఆర్టిల్లరీ విభాగానికి చెందిన వాడని ఆర్మీ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌లోని 151 ఎంసీ/ఎంఎఫ్ డిటాచ్మెంట్ వి భాగంలో పనిచేస్తున్నట్లు అందులో పేర్కొంది. -
అనుష్క పది లక్షలు ఇచ్చిన తర్వాతే..!
-
'అనుష్క నా అకౌంట్లో 10 లక్షలు జమ చేసింది'
హైదరాబాద్ : పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్మీ అధికారి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ (40) విచారణలో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాక్ మహిళ అనుష్క అగర్వాల్‌తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పటన్ కుమార్ వెల్లడించారని చెప్పారు. అలాగే అనుష్క తన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేసిందని చెప్పాడన్నారు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంచ్ సెక్టర్లో ఆర్మీ కదలికలపై అనుష్కకు సమాచారం అందించాడన్నారు. అయితే పటన్‌కుమార్ చెందిన రెండు అకౌంట్ల నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పటన్ కుమార్‌ను తమకు అప్పగించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పటన్ కుమార్‌ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయని తెలిపారు. పోలీసుల విచారణలో పొద్దార్ నాయక్ వెల్లడించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అనుష్క అగర్వాల్‌తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. -
సైనికాధికారి దేశద్రోహం
-
సైనికాధికారి దేశద్రోహం
* అరెస్టు చేసిన హైదరాబాద్పోలీసులు * మహిళా ఉగ్రవాది ట్రాప్‌లో పడి సైనిక రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐ సంస్థకు చెందిన ఓ మహిళా ఏజెంట్ మిలటరీ అధికారిని తన ఫేస్బుక్ ద్వారా ట్రాప్‌లోకి దింపింది. అతని ద్వారా మిలటరీ స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల సారాంశం, వారి రాకపోకల వివరాలను రాబట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ దేశద్రోహిని అరెస్టు చేసి నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బుధవారం హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి మరిన్ని రహస్య సమాచారాలు రాబట్టేందుకు ఏడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్(40) సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయే మిలటరీ అధికారులకు ఆహ్వానం పలకడం, వీడ్కోలు తెలపడం లాంటి విధులు నిర్వహించేవాడు. మిలటరీ అధికారులకు రిజర్వేషన్ టికెట్లు కూడా సమకూర్చేవాడు. ఏడాది క్రితం అనుష్క అగర్వాల్(పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది, ఏజెంట్)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఆమె తన నగ్న ఫోటోలను, నగ్న చిత్రాలను పటన్‌కు పంపింది. ఆమె వలలో పడ్డ పటన్ ఈమెయిల్, ఫేస్బుక్, ఫోన్ ద్వారా దేశానికి చెందిన మిలటరీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల తేదీలు, సమావేశాల సారాంశాలు, అధికారులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. అతనిపై అనుమానం వచ్చిన మిలటరీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కేసును డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు డీజీపీ తెలియజేశారు. పటన్పై దేశద్రోహంతో పాటు అధికార రహస్య రక్షణ చట్టం -1923 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం.... పటన్ గురించి మరింత సమాచారం కోసం డీజీపీ అనురాగ్‌శర్మ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అతన్ని ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ వేశారు. అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు పటన్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఉలిక్కిపడ్డ మిలటరీ వర్గాలు... నిన్న మొన్నటి వరకు తమతో పాటు విధులు నిర్వహించిన ఉద్యోగి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ (40) దేశద్రోహానికి పాల్పడి పట్టుబడడంతో సికింద్రాబాద్, మెహదీపట్నం, కంటోన్మెంట్‌లోని మిలటరీ కేంద్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇక్కడి స్థావరాల వివరాలు, అధికారుల పేర్లు, సెల్ నంబర్లు పాకిస్థాన్‌లోని మహిళా ఉగ్రవాదికి చేరడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఢిల్లీలోని మిలటరీ ఉన్నతాధికారులు గురువారం నగరానికి రానున్నట్లు సమాచారం. మరోపక్క దర్యాప్తులో భాగంగా నగర పోలీసులు పటన్ వాడిన కంప్యూటర్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్‌డిస్క్‌ను డీకోడ్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మిలటరీ అధికారులు రాకపోకలు సాగించే సమయంలో ఇతని వెంట ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉండేవారా అనే కోణంలో స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి పటన్.. మహిళా ఉగ్రవాదితో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అతని సెల్‌ఫోన్ కాల్‌డేటా తీసిన అధికారులకు అందులో కీలకమైన కొన్ని సెల్ నంబర్లు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నంబర్లు ఉగ్రవాదులకు చెందినవా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన ఫోన్ నంబర్లు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. అతని గదిలో కీలకమైన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది. అలాగే సెక్యూర్డ్ లైఫ్ అనే కంపెనీ పేరుతో మనీ సర్క్యులేషన్ నెట్‌వర్క్‌ను కూడా నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనిపై మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. పటన్ మిలటరీ రహస్యాలను అందించింది అనుష్క అగర్వాల్ అనే మహిళకని, ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. ఈమె తన పేరును మార్చి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నివాముంటున్నట్లు ఫేస్బుక్ తెరిచింది. ఈ ఫేస్‌బుక్‌తోనే పటన్‌ను ఆమె వలలో వేసుకుంది.