సైనికాధికారి దేశద్రోహం | Army Subedar held for passing military secrets to Pakistani woman | Sakshi
Sakshi News home page

సైనికాధికారి దేశద్రోహం

Published Thu, Aug 7 2014 2:31 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

సైనికాధికారి దేశద్రోహం - Sakshi

సైనికాధికారి దేశద్రోహం

* అరెస్టు చేసిన హైదరాబాద్‌పోలీసులు  
* మహిళా ఉగ్రవాది ట్రాప్‌లో పడి సైనిక రహస్యాల చేరవేత
 
సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్‌ఐ సంస్థకు చెందిన ఓ మహిళా ఏజెంట్ మిలటరీ అధికారిని తన ఫేస్‌బుక్ ద్వారా ట్రాప్‌లోకి దింపింది. అతని ద్వారా మిలటరీ స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల సారాంశం, వారి రాకపోకల వివరాలను రాబట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ దేశద్రోహిని అరెస్టు చేసి నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బుధవారం హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

నిందితుడి నుంచి మరిన్ని రహస్య సమాచారాలు రాబట్టేందుకు ఏడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్(40) సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయే మిలటరీ అధికారులకు ఆహ్వానం పలకడం, వీడ్కోలు తెలపడం లాంటి విధులు నిర్వహించేవాడు. మిలటరీ అధికారులకు రిజర్వేషన్ టికెట్లు కూడా సమకూర్చేవాడు.

ఏడాది క్రితం అనుష్క అగర్వాల్(పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మహిళా ఉగ్రవాది, ఏజెంట్)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఆమె తన నగ్న ఫోటోలను, నగ్న చిత్రాలను పటన్‌కు పంపింది. ఆమె వలలో పడ్డ పటన్ ఈమెయిల్, ఫేస్‌బుక్, ఫోన్ ద్వారా దేశానికి చెందిన మిలటరీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల తేదీలు, సమావేశాల సారాంశాలు, అధికారులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. అతనిపై అనుమానం వచ్చిన మిలటరీ అధికారులు నిఘా పెట్టారు.

ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కేసును డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు డీజీపీ తెలియజేశారు. పటన్‌పై దేశద్రోహంతో పాటు అధికార రహస్య రక్షణ చట్టం -1923 తదితర సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
 
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం....
పటన్ గురించి మరింత సమాచారం కోసం డీజీపీ అనురాగ్‌శర్మ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అతన్ని ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ వేశారు. అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు పటన్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి.
 
ఉలిక్కిపడ్డ మిలటరీ వర్గాలు...
నిన్న మొన్నటి వరకు తమతో పాటు విధులు నిర్వహించిన ఉద్యోగి పటన్‌కుమార్ పొద్దార్ నాయక్ (40) దేశద్రోహానికి పాల్పడి పట్టుబడడంతో సికింద్రాబాద్, మెహదీపట్నం, కంటోన్మెంట్‌లోని మిలటరీ కేంద్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇక్కడి స్థావరాల వివరాలు, అధికారుల పేర్లు, సెల్ నంబర్లు పాకిస్థాన్‌లోని మహిళా ఉగ్రవాదికి చేరడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఢిల్లీలోని మిలటరీ ఉన్నతాధికారులు గురువారం నగరానికి రానున్నట్లు సమాచారం.

మరోపక్క దర్యాప్తులో భాగంగా నగర పోలీసులు పటన్ వాడిన కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్‌డిస్క్‌ను డీకోడ్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి  మిలటరీ అధికారులు రాకపోకలు సాగించే సమయంలో ఇతని వెంట ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉండేవారా అనే కోణంలో స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటర్‌నెట్ సెంటర్ల నుంచి పటన్.. మహిళా ఉగ్రవాదితో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అతని సెల్‌ఫోన్ కాల్‌డేటా తీసిన అధికారులకు అందులో కీలకమైన కొన్ని సెల్ నంబర్లు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నంబర్లు ఉగ్రవాదులకు చెందినవా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన ఫోన్ నంబర్లు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. అతని గదిలో కీలకమైన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది.

అలాగే సెక్యూర్డ్ లైఫ్ అనే కంపెనీ పేరుతో మనీ సర్క్యులేషన్ నెట్‌వర్క్‌ను కూడా నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనిపై మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. పటన్ మిలటరీ రహస్యాలను అందించింది అనుష్క అగర్వాల్ అనే మహిళకని, ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. ఈమె తన పేరును మార్చి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నివాముంటున్నట్లు ఫేస్‌బుక్ తెరిచింది. ఈ ఫేస్‌బుక్‌తోనే పటన్‌ను ఆమె వలలో వేసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement