'అనుష్క నా అకౌంట్లో 10 లక్షలు జమ చేసింది'
హైదరాబాద్ : పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్మీ అధికారి పటన్కుమార్ పొద్దార్ నాయక్ (40) విచారణలో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాక్ మహిళ అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పటన్ కుమార్ వెల్లడించారని చెప్పారు. అలాగే అనుష్క తన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేసిందని చెప్పాడన్నారు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంచ్ సెక్టర్లో ఆర్మీ కదలికలపై అనుష్కకు సమాచారం అందించాడన్నారు. అయితే పటన్కుమార్ చెందిన రెండు అకౌంట్ల నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పటన్ కుమార్ను తమకు అప్పగించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పటన్ కుమార్ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయని తెలిపారు. పోలీసుల విచారణలో పొద్దార్ నాయక్ వెల్లడించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్తో ఉందని పోలీసులు వెల్లడించారు.