ఎంతమంది జవాన్లు ‘బుక్’ అయ్యారు!
* విచారణ చేపట్టిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో
* ఫేస్‌బుక్ నుంచి వివరాలు తొలగించిన అనుష్క
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ నుంచి మిలటరీ స్థావరాల రహస్యాలు సంపాదించిన అనుష్క (ఐఎస్‌ఐ ఏజెంట్) ఫేస్‌బుక్‌లో ఉన్న మిగతా 20 మంది సైనికాధికారులపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కన్నేసింది. పటాన్ ఉదంతం వెలుగు చూడగానే అనుష్క తన ఫేస్‌బుక్‌లో ఉన్న ఆ 20 మంది సైనికాధికారుల పేర్లు, ఫొటోలను శుక్రవారం తొలగించింది. అయితే అప్పటికే ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్న ఆ అధికారుల పేర్లు, ఫొటోలను నగర సైబర్ క్రైం పోలీసులు వెలికితీశారు. వారి వివరాలను ఐబీకి పంపినట్లు తెలిసింది. ఈ వివరాలతో దేశంలోని అన్ని ఆర్టిలరీ సెంటర్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు. పటన్ ఉదంతంపై మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది. పటన్ బ్యాంకు అకౌంట్‌ను సీజ్ చేయాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
రెండు రోజుల్లో ఫొరెన్సిక్ రిపోర్టు...
పటన్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని వెలికి తీసేందుకు రామంతాపూర్‌లోని సెంటర్ ఫర్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పటన్ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలతో పాటు అతని ఈ మెయిల్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు సైతం బయట పడనున్నాయి. ఈ మెసేజ్‌లను పరిశీలిస్తే అనుష్క, పటన్‌ల మధ్య నడిచిన వ్యవహారం పూర్తిగా బట్టబయలయ్యే అకాశాలు ఉన్నాయి. సీసీఎస్ పోలీసులు, మిలటరీ అధికారులు, ఎన్‌ఐఏ, ఐబీ అధికారులు ఈ ఫొరెన్సిక్ నివేదిక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే పటన్‌ను పోలీసు కస్టడీకి తీసుకున్న తరువాత సీసీఎస్ అధికారులు అతన్ని తిరిగి విచారించనున్నారు. అయితే పోలీసు కస్టడీకి ఇచ్చే విషయంపై సోమవారం తుది తీర్పు రానుంది.
పటాన్‌పై ఎన్‌ఐఏ దృష్టి...
సీసీఎస్ పోలీసులు పటన్‌ను కస్టడీకి తీసుకుని విచారించిన తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే సంస్థ అధికారులు కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు పటన్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు ఐబీ అధికారులు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి.