powel
-
Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్ తెలిపిన వివరాలతో గ్లోబల్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్‌లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్‌లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది. -
ఐదేళ్లలో అతిపెద్ద జంప్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం భారీగా లాభపడింది. ఒకేరోజు 112 పైసలు బలపడి 70.44 వద్ద ముగిసింది. రూపాయి కేవలం ఒక్కరోజే ఈ స్థాయిలో రికవరీ కావడం గడచిన ఐదేళ్లో ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం కావటం, దీనితో దేశ కరెంట్ అకౌంట్ లోటుపై భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 71.34 వద్ద ప్రారంభమైన రూపాయి, అటు తర్వాత క్రమంగా పుంజుకుంది. మరింతగా విశ్లేషిస్తే... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది. అయితే 71–70 స్థాయిలో తిరుగుతోంది. కరెన్సీ పరంగా చూస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, ప్రామాణిక వడ్డీరేటు సమీప భవిష్యత్తులో ‘‘తటస్థ స్థాయి’’లోనే ఉంటుందని సూచించారు. ఈ ప్రకటనతో డాలర్ ఇండెక్స్ తదుపరి ర్యాలీ అంచనాలను నీరుగార్చాయి. బుధవారం ఫెడ్ ఫండ్ రేటు పెరగబోదన్న అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు వార్తలు కూడా రూపాయి బలోపేతం సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 32 డాలర్లు కిందకు దిగాయి. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్సే్చంజ్‌లో ట్రేడయ్యే లైట్ స్వీట్ బేరల్ ధర మంగళవారం ఒక దశలో 47.50 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఇక భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ బేరల్ ధర మంగళవారం ట్రేడింగ్ ఒక దశలో 57.23ని తాకింది. రెండు నెలల క్రితం ఈ ధర 86.74 డాలర్ల వద్ద ఉంది. ఈ వార్త రాసే 9 గంటల సమయంలో నైమెక్స్, బ్రెంట్ క్రూడ్ ధరలు వరుసగా 47.80, 57.30 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో మళ్లీ ప్రపంచం మాద్యంలోకి జారిపోయే అవకాశం ఉందన్న భయాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు కోత వంటి అంశాలు క్రూడ్ పరుగును అడ్డుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్ భారీ స్థాయిల్లో ఉండటం తగదన్న అమెరికా అధ్యక్షుని ప్రకటనలు, క్రూడ్ నిల్వలు పెరగడం వంటి అంశాలూ క్రూడ్ ధరలు దిగిరావడానికి కారణం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో తిరిగి క్రూడ్ మళ్లీ 30 డాలర్లు పైకి ఎగసి, ఇటీవలి గరిష్ట స్థాయిలను చూడ్డం కష్టమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
అమెరికా జోరు ఇప్పుడే తగ్గదు: పావెల్
అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చాలా విశ్వా సంతో ఉన్నామని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. భవిష్యత్ వృద్ధి అంచనాలు సానుకూలముగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగిత నాలుగు శాతానికి దిగువున ఉందని, ఇది శుభపరిణామని, ఇదే ట్రెండ్ వచ్చే 2 ఏళ్ల వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. వేతనాలు పెరిగినా కూడా ద్రవ్యోల్బణం మోస్తారుగా ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన అంశమని అభిప్రాయపడ్డారు. తక్కువ స్థాయి నిరుద్యోగిత, ధరల పెరుగుదల అంచనాల నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించేందుకు వడ్డీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తామని తెలిపారు. నిరుద్యోగిత తక్కువ స్థాయిల్లో ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పెంచడమనేది సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. అయితే రేట్లు పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై నెగటివ్ ప్రభావం ఉంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడ్ ఎప్పటికప్పుడు తగిన చర్యలతో ముందుకెళ్తుందని పావెల్ తెలిపారు. సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాయనే నమ్మకం సహా ప్రజల్లో, కంపెనీల్లో ద్రవ్యోల్బణ భయాలు లేకపోవడం వల్ల ధరల పరుగుదల నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.