చీకట్లు!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాపై పడింది. గురువారం చాలా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సమాధానం రావడంతో అయోమయానికి గురయ్యారు. అక్కడికి వెళ్తే సిబ్బంది సమ్మెలో ఉన్నారని తెలిసి ఆవేదన చెందారు.
విశాఖ అర్బన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తాయి. నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, అచ్యుతాపురం, నాతవరం, వడ్డాది మాడుగుల, పాములవలస, అనకాపల్లి, భీమిలి, చిట్టివలస సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ బ్రేక్ డౌన్లు అయ్యాయని ఫిర్యాదులందాయి. వీటి సమస్యలను పరిష్కరించి విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయి సిబ్బంది సహకరించకపోవడంతో విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో అధికారులే చెప్పలేకపోతున్నారు.