Powered
-
వాయువేగంతో.. నీటిపై: సరికొత్త ఎలక్ట్రిక్ సర్ఫ్బోర్డ్ (ఫోటోలు)
-
రోడ్లకు సోలార్ సిమెంట్ వెలుగులు
మెక్సికోః ఇకపై చీకట్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండానే రహదార్లు ప్రకాశవంతం కానున్నాయి. మెక్సికో సైంటిస్టుల సృష్టి.. వాహనదారులకు, ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. సూర్యరశ్మితో తయారయ్యే విద్యుత్ విధానమైన సోలార్ పవర్ ను కరెంటు లేని సమయంలో వినియోగించుకునే విధానంతో రోడ్లను నిర్మించే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. తమ ప్రయత్నాలు ప్రయోగ స్థాయిని అధిగమించి విజయవంతమవ్వడంతో త్వరలో కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెక్సికోలోని మికోకెన్స్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ నికోలస్ హిడాల్గో (ఎంఎస్ఎన్ఎస్) కు చెందిన శాస్త్రవేత్తలు.. సోలార్ శక్తితో కూడిన రోడ్లకు రూపకల్పన చేశారు. సోలార్ విద్యుత్తును పీల్చుకోగలిగే సిమెంట్ తో రోడ్లను నిర్మించే విధానాన్ని కనిపెట్టారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రాజెక్టును ప్రారంభించిన సైంటిస్ట్ జోసే రూబియో.. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే కొత్త సిమెంట్ ను కనిపెట్టారు. జీబ్రా క్రాసింగ్స్ లోనూ, రెండు రోడ్లను విభజించేందుకు, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఇప్పటిదాకా రేడియం పదార్థాన్ని, లైట్లను వాడుతుండగా ఇకపై స్వయం ప్రకాశిత సిమెంట్ ను వినియోగించి రోడ్లను కాంతివంతంగా మార్చే పద్ధతికి రూబియో శ్రీకారం చుట్టారు. కొత్తగా కనుగొన్న సిమెంట్ తో రోడ్లు వేయడం వల్ల... అవి పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి సమయంలో సోలార్ విద్యుత్ కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంట్ తో నిర్మించిన రోడ్లపై ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతి వెదజల్లుతుంటుంది. దీంతో రోడ్ లైట్స్ లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడే రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు నాలుగేళ్ళపాటు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోయే పరిస్థితిలో... ఈ స్వయం ప్రకాశిత సిమెంట్ మాత్రం... వందల ఏళ్ళైనా తన కాంతిని కోల్పోదు. అయితే రోడ్లకు ఈ సిమెంట్ వాడితే దానిపై పడే దుమ్ము, ధూళి వల్ల కాంతిని కోల్పోతాయన్న అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారని, సమస్యను అధిగమించేందుకు సిమెంట్ లో క్రిస్టల్స్ ను కూడ వినియోగించినట్లు రూబియో తెలిపారు. కొత్తరకం సిమెంట్ తో నిర్మించిన ఈ రోడ్లు ఒకరోజు మొత్తం సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా వాటికి అందిన సోలార్ శక్తితో 12 గంటలపాటు ప్రకాశించగల్గుతాయి. అంతేకాక పర్యావరణ అనుకూలంగా ఉండటంతోపాటు, భూమికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగదని, రోడ్ల నిర్మాణంపై ప్రయోగాలు పూర్తిచేసిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ పొందిన వెంటనే తమ ప్రాజెక్టుద్వారా రోడ్ల అభివృద్ధిని ప్రారంభిస్తామని రూబియో వెల్లడించారు. -
ఎలక్ట్రికల్ బస్సులతో కాలుష్యానికి చెక్
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టనున్న కార్యక్రమాల్లో మరో అడుగు ముందుకు పడనుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న హస్తినను కాపాడటంలో భాగంగా ఇప్పటికే నెంబర్ ప్లేట్ల విధానం అమల్లోకి రాగా... ప్రస్తుతం బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులను ప్రవేశ పెట్టే యోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే డిసెంబర్ 21న మంత్రులకు రెండు ఎలక్ట్రికల్ బస్సులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులకు లిథియం, అయాన్ కలయికల తో తయారయ్యే బ్యాటరీలను ఇస్రో అందించనుంది. రోజురోజుకూ పెరిగిపోతున్నకాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులను ప్రవేశపెట్టనుంది. ముందుగా దేశ రాజధానిలో 15 బస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ విద్యుత్ బస్సులకు వినియోగించే బ్యాటరీలను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటే సుమారు 55 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా... వీటిని ఇస్రో కేవలం 5 లక్షల రూపాయలకే అందించనుంది. ఇస్రోలో పవర్ శాటిలెట్లకు ఇవే బ్యాటరీలను వినియోగిస్తుంటారు. ఈ బ్యాటరీలు చవగ్గా దొరకడంవల్ల పొదుపుతోపాటు, వీటిని తిరిగి వాడుకునేందుకు వీలవ్వడం ఓ విశేషం. ఈ పైలట్ ప్రాజెక్టులో మంత్రులకు ఇచ్చే రెండు బస్సులతోపాటు మొత్తం 15 బస్సులు ఢిల్లీ రోడ్లపైకి ఎక్కే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రికల్ బస్సులను నడపాలన్న యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ద్వారా దేశంలో మొత్తం 1.5 లక్షల డీజిల్ బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయని, వాటి స్థానంలో ఇస్రో సాంకేతిక సహకారం అందించే బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులు నడిపేందుకు యోచిస్తున్నామని, రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వీటి ద్వారా సుమారు 8 లక్షల కోట్ల రూపాయల బిల్లు తగ్గుతుందని పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శుభ్రతతోపాటు, ఖర్చును తగ్గించే ఈ ప్రయత్నం, ప్రత్యామ్నాయ ఇంధన వాడకానికి మార్గమౌతుందని అన్నారు. ఢిల్లీలో పొగమంచులా కప్పుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు భవిష్యత్తులో ఈ ప్రయత్నం సహకరిస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.