రోడ్లకు సోలార్ సిమెంట్ వెలుగులు
మెక్సికోః ఇకపై చీకట్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండానే రహదార్లు ప్రకాశవంతం కానున్నాయి. మెక్సికో సైంటిస్టుల సృష్టి.. వాహనదారులకు, ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. సూర్యరశ్మితో తయారయ్యే విద్యుత్ విధానమైన సోలార్ పవర్ ను కరెంటు లేని సమయంలో వినియోగించుకునే విధానంతో రోడ్లను నిర్మించే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. తమ ప్రయత్నాలు ప్రయోగ స్థాయిని అధిగమించి విజయవంతమవ్వడంతో త్వరలో కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెక్సికోలోని మికోకెన్స్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ నికోలస్ హిడాల్గో (ఎంఎస్ఎన్ఎస్) కు చెందిన శాస్త్రవేత్తలు.. సోలార్ శక్తితో కూడిన రోడ్లకు రూపకల్పన చేశారు. సోలార్ విద్యుత్తును పీల్చుకోగలిగే సిమెంట్ తో రోడ్లను నిర్మించే విధానాన్ని కనిపెట్టారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రాజెక్టును ప్రారంభించిన సైంటిస్ట్ జోసే రూబియో.. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే కొత్త సిమెంట్ ను కనిపెట్టారు. జీబ్రా క్రాసింగ్స్ లోనూ, రెండు రోడ్లను విభజించేందుకు, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఇప్పటిదాకా రేడియం పదార్థాన్ని, లైట్లను వాడుతుండగా ఇకపై స్వయం ప్రకాశిత సిమెంట్ ను వినియోగించి రోడ్లను కాంతివంతంగా మార్చే పద్ధతికి రూబియో శ్రీకారం చుట్టారు.
కొత్తగా కనుగొన్న సిమెంట్ తో రోడ్లు వేయడం వల్ల... అవి పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి సమయంలో సోలార్ విద్యుత్ కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంట్ తో నిర్మించిన రోడ్లపై ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతి వెదజల్లుతుంటుంది. దీంతో రోడ్ లైట్స్ లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడే రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు నాలుగేళ్ళపాటు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోయే పరిస్థితిలో... ఈ స్వయం ప్రకాశిత సిమెంట్ మాత్రం... వందల ఏళ్ళైనా తన కాంతిని కోల్పోదు. అయితే రోడ్లకు ఈ సిమెంట్ వాడితే దానిపై పడే దుమ్ము, ధూళి వల్ల కాంతిని కోల్పోతాయన్న అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారని, సమస్యను అధిగమించేందుకు సిమెంట్ లో క్రిస్టల్స్ ను కూడ వినియోగించినట్లు రూబియో తెలిపారు.
కొత్తరకం సిమెంట్ తో నిర్మించిన ఈ రోడ్లు ఒకరోజు మొత్తం సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా వాటికి అందిన సోలార్ శక్తితో 12 గంటలపాటు ప్రకాశించగల్గుతాయి. అంతేకాక పర్యావరణ అనుకూలంగా ఉండటంతోపాటు, భూమికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగదని, రోడ్ల నిర్మాణంపై ప్రయోగాలు పూర్తిచేసిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ పొందిన వెంటనే తమ ప్రాజెక్టుద్వారా రోడ్ల అభివృద్ధిని ప్రారంభిస్తామని రూబియో వెల్లడించారు.