పరిహారంపై ప్రకటన చేయాలి
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్నేని నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. సోమవారం చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రజా చైతన్య రైతు సదస్సు నిర్వహించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాలువ తవ్వకం పనులను అడ్డుకోవాలని తీర్మానించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నాగేంద్రబాబు విమర్శించారు. సమస్యలపై పోరాటం చేస్తే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల భూములను కాజేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంత రైతులకు సాగు నీటి వసతి కల్పించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని మంజూరు చేశారన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు రైతుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరారు. భారతీయ కిసాన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో జిల్లా కలెక్టర్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పీతల సుజాత సైతం రైతుల బాధలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా చైతన్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.అమర్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు 4 రెట్లు నష్ట పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు అలవాల ఖాదర్బాబురెడ్డి, చిట్లూరి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు.