Prajarajyam
-
బాబు నుంచి పవన్‌కు రూ.1,500 కోట్లు ముట్టాయి
సీతమ్మధార (విశాఖ ఉత్తర): చంద్రబాబు నుంచి రూ.1,500 కోట్లు పవన్‌కు ముట్టాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ ఆరోపించారు. ఆదివారం విశాఖలోని ఆశీలమెట్టలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కుక్కలాగా అమ్ముడు పోయాడని వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని, అందువల్లే పవన్ వెంట కాపులు లేరన్నారు. వారిద్దరూ కాపులను అమ్ముకోవడానికే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు పెట్టారని చిరంజీవి, పవన్‌లను ఉద్దేశించి అన్నారు. 2019లో జనసేనలో లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ ఇద్దరే చేరారని, ఎన్నికలు అయిపోయిన వెంటనే వారూ బయటకు వచ్చారని గుర్తు చేశారు. పార్టీ జాతీయ వైస్.ప్రెసిడెంట్ డాక్టర్.కుమార్, మమత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాలో చిరం‘జీవం’ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన చిరంజీవికి కృష్ణాజిల్లాలో సొంత వర్గం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నుంచి యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో యలమంచలి రవికి మంత్రిపదవి వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే ఆయనకు ఆ పదవి దక్కకపోగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో కష్టాలు తప్పలేదు. ప్రతి విషయంలోనూ పార్టీలో నెహ్రూ మాట చెల్లబడి అయ్యింది. ఆఖరికి డివిజన్ అధ్యక్షుల ఎంపిక, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ రవికి మొండిచెయ్యి దక్కింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ పశ్చిమం నుంచి ఎన్నికైన వెల్లంపల్లి శ్రీనివాస్‌ది భిన్నమైన కధ. ఆయన ఏం చేసినా చిరంజీవి చూసీ చూడనట్లు వదిలేశారు. దుర్గగుడిపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులొచ్చినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా సీటు ఇప్పించారు. తీరా సీటు వచ్చిన 24 గంటల్లోపే వెల్లంపల్లి తనదారి చూసుకున్నారు. తిరువూరులో కాంగ్రెస్ సీటు ఆశించి అది దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శ్రీనివాసరావు చిరంజీవిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇప్పిస్తానని చెప్పి రెండున్నర ఎకరాల పొలాన్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 2014లో కూడా సీటు ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్‌లో కలవకుండా ఉండిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా వైఎస్సార్ సీపీలో, 2009లో గుడివాడ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశంలో చేరిపోగా, కైకలూరులో కామినేని శ్రీనివాస్ బీజెపీ తీర్థం పుచ్చుకుని అభ్యర్థిగా బరిలోకి దిగారు. జిల్లాలో ఏ నాయకుడు కూడా చిరంజీవిని నమ్ముకునే సాహసం చేయకపోవడం తగ్గిపోయిన ఆయన ప్రాభవానికి అద్దం పడుతోంది. -
పార్టీని అమ్ముకోడానికి సిగ్గు లేదూ?
చిరంజీవిపై ప్రజారాజ్యం కార్యకర్త మండిపాటు ‘ప్రజలను ఎక్కడికో తీసుకెళతానంటూ.. ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టి, అభిమానుల మనోభావాలను కాంగ్రెస్‌కు అమ్ముకున్నావ్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు?’ అంటూ ప్రజారాజ్యం కార్యకర్త కె.బాబ్జీ కేంద్ర మంత్రి చిరంజీవిపై విరుచుకుపడ్డాడు. ‘నేను ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీకి కట్టుబడి, అదే గుర్తింపు కార్డుతో కార్యకర్తగా కొనసాగుతున్నాను. కానీ నువ్వు మాత్రం అధ్యక్షుడి స్థానంలో ఉండి పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదూ?’ అని ప్రశ్నించాడు. ‘నీకు సిగ్గు రావాలనే ఉద్దేశంతో.. నీ పార్టీ ఇచ్చిన గుర్తింపు కార్డును నీ కళ్లముందే చింపేస్తున్నాను..’ అంటూ ఆవేశంగా తన పర్సులో ఉన్న కార్డును తీసి చింపేశాడు. అనంతరం ‘పవన్‌కల్యాణ్ జిందాబాద్, జనసేన వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశాడు. దీంతో బిత్తరపోవడం చిరంజీవి వంతరుు్యంది. ఏపీ కాంగ్రెస్ నాయకుల బస్సుయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ మూడు రోడ్ల కూడలిలో చిరంజీవి ప్రసంగిస్తుండగా.. కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన బాబ్జీ అడ్డుపడ్డాడు. కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్షి, జె.డి.శీలం, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరుల సమక్షంలోనే చిరంజీవిని నిలదీశాడు. దీంతో ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ఆపి బస్సు ఎక్కేశారు. ఇదిలా ఉండగా పిఠాపురం వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలను వినేందుకు జనం కరువయ్యారు. కనీసం వందమంది కూడా లేకపోవడంతో నేతలు తూతూ మంత్రంగా ప్రసంగాలు ముగించారు. -
‘ఆ నలుగురు‘లో చీలిక
గంటా వర్గంలో టికెట్ల గుబులు ‘దేశం’లోకి వెళ్దామంటే కార్యకర్తలు ససేమిరా ముందు జాగ్రత్తలతో కొందరు కొత్త మార్గాలు ‘ఐదేళ్లుగా ఒకే మాటగా ఉన్నాం.. మంత్రి గంటా శ్రీనివాసరా వు అడుగులను అనుసరించాం..ఇప్పుడూ ఆయన వెంటే ఉంటే పరిస్థితి ఏంటి..నష్టపోతామేమో’.. గంటా గ్రూపులోని ఎమ్మెల్యేలను వెంటాడుతున్న సంశయమిది. అందుకే భారమంతా ఆయన మీద వేసినా ముందు జాగ్రత్త చర్య గా కొత్తదారులు వెదుక్కోవడం మంచిదనే ఆలోచనలో వీరంతా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన గంటా శ్రీని వాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీని వాసరావు, పంచకర్ల రమేష్‌బాబు ఐదేళ్లుగా ఒక వర్గంగా కొనసాగుతున్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కాకమునుపు, ఆ తర్వాత కూడా మిగతా ముగ్గురు గంటా నాయకత్వంలోనే పనిచేసుకుపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యలమంచిలి శాసన సభ్యుడు రమణమూర్తిరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కూడా తాజాగా ఈ గ్రూపులో సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని, ఆ పార్టీ తరపున పోటీకి దిగితే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోవడం మంచిదని వీరంతా గట్టిగా నమ్ముతున్నారు. ఈ వర్గంలోని కొందరు బహిరంగంగానే ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అంతా కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రి నాయకత్వంలో జరిగిన పిచ్చాపాటి సమావేశాల్లో ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. తాము ఎక్కడికెళ్లాలి?, ఏ పార్టీకి వెళితే ఎక్కడి నుంచి టికెట్లు ఇస్తారు?, అందరినీ ఎలా సర్దుబాటు చేస్తారనే భారం మొత్తం వీరు గంటా మీదే వేసి ఆయన నిర్ణయమే తమ నిర్ణయమనేలా కొనసాగుతూ వచ్చారు. ఇందులో భాగంగానే కేడర్‌ను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ వీరంతా టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారనే ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఇటీవల ఒక శాసన సభ్యుడు పార్టీ కేడర్‌తో నిర్వహించిన సమావేశంలో ‘మీరు టీడీపీకి వెళితే వెళ్లండి. మేం మాత్రం ఆ పార్టీలోకి వచ్చేది లేదు’ అని మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు సైతం తెగేసి చెప్పడంతో ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారని తెలిసింది. మరో ఎమ్మెల్యేకి కూడా ఇదే సెగ తగలడంతో ఏం చేయాలో పాలుపోక అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోరుకుంటున్న పార్టీలో గ్రూపు మొత్తానికి టికెట్లు దొరికే అవకాశాలు కనిపించడం లేదని, అలాంటప్పుడు తమ పరిస్థితి ఏమవుతుందని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. చివరి వరకు ఇలా అనిశ్చితిలోనే గడిపి అంతా అయ్యాక ఎక్కడా బెర్త్ ఖరారు కాకపోతే రాజకీయంగా నష్టపోతామనే భయం వీరిని ఆవహించింది. దీంతో ఒక వైపు గంటాకు జై కొడుతూనే మరో వైపు తమ జాగ్రత్తలో తాము ఉంటున్నారు. అవకాశం దొరికితే కచ్చితంగా గెలుస్తామనే చోటికే చేరాలనే దిశగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.